Today Mirchi price: ఎర్ర బంగారం దుమ్మురేపుతోంది. రైతులకు కాసుల పంట పండిస్తోంది. దేశీ రకం మిర్చి ధర రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకెళ్తుంది. ఏకంగా బంగారం రేటుతో పోటీ పడుతూ దూసుకుపోతుంది. దీంతో మిర్చి రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. నిత్యం నష్టాలపాలయ్యే మిర్చి రైతులకు రికార్డు స్థాయిలో పలుకుతున్న ధరలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వరంగల్ జిల్లా( Warangal District) ఎనుబాముల మార్కెట్(Enumamula Market) చరిత్రలోనే తొలిసారిగా దేశీ రకం మిర్చికి రూ. 44 వేల గరిష్ఠ ధర ధర పలికింది. సింగిల్ పట్టి రకం రూ. 42,500 ధర పలికినట్లు.. మార్కెట్ అధికారులు తెలిపారు. ఇంత ధర గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాలు, వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా పంట దెబ్బతింది. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో మిర్చికి డిమాండ్ ఏర్పడటంతో మిరప ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని.. వ్యాపారులు చెబుతున్నారు. ఏళ్లుగా మిర్చిని పండిస్తూనే ఉన్నప్పటికీ.. ఈ స్థాయి ధరను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. నిత్యం ఇదే స్థాయిలో ధరలు ఉంటే మిర్చి రైతులకు కన్నీరే ఉండదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గిపోవడంతో కొంతమేర రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ దేశంలోనే అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో మిర్చిని విక్రయించేందుకు రైతులు వస్తూ ఉంటారు. రెండో కోత చేతికి రావడంతో రైతులు పంటను మార్కెట్‌కు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. గతేడాది ఎకరాకు 20 నుంచి 30 క్వింటాలు వరకు దిగుబడి వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఎకరాకు 10 క్వింటాల్ దిగుబడి రావడమే గగనమైంది. కొన్ని చోట్ల అయితే ఎకరాకు 4,5 క్వింటాల్ మాత్రమే దిగుబడి వచ్చింది. కాగా ఇతర దేశాలకు మిర్చిని ఎగుమతి చేస్తున్నందున ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: కల్లు తాగుతున్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో గుర్తించగలరా..?.. చాలా ఈజీనే