Chilli Price: బంగారంతో పోటీ పడుతున్న ఎర్రబంగారం.. ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!

|

Mar 09, 2022 | 8:53 PM

Chilli Price: ఎర్రబంగారం ధరలు పసిడితో సమాంతరంగా పరుగులు పెడుతున్నాయి. వ్యవసాయ రంగం చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించాయి.

Chilli Price: బంగారంతో పోటీ పడుతున్న ఎర్రబంగారం.. ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
Mirchi
Follow us on

Chilli Price: ఎర్రబంగారం ధరలు పసిడితో సమాంతరంగా పరుగులు పెడుతున్నాయి. వ్యవసాయ రంగం చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించాయి. బహుషా ఈ ధరలు దేశంలోనే ఆల్ టైమ్స్ రికార్డుగా నిలువనున్నా యి. ఇప్పటికే క్వింటాకు 41 వేల రూపాయలు దాటిన మిర్చి ధరలు రేపో మాపో 50 వేల రూపాయలకు చేరుకోబోతుంది. అసలు మిర్చి ధరలు ఇలా రికార్డుల మోత మోగడానికి కారణాలేంటి..? కేవలం ఆ ఒక్క రకం మిర్చి ధరే ఎందుకు అర లక్షకు చేరువయ్యింది..? ఎర్ర బంగారం ధగధగలపై టీవీ9 ప్రత్యేక కథనం..

ఎర్రబంగారం సాగు చరిత్రలోనే సరికొత్త అధ్యాయం ఇది.. మిర్చి ధరలు రైతుల మొఖాల్లో చిరునవ్వులు విరబూసేలా చేస్తున్నాయి. మిర్చి ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. గతంలో 18వేల రూపాయలకు క్వింటా అంటేనే అమ్మో అనేవారు. ఇప్పుడు ఏకంగా క్వింటా మిర్చికి 41 వేల రూపాయల ధర పలుకుతుంది. వరంగల్‌లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ధరలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. సింగిల్ పట్టి మిర్చికి క్వింటాకు ఏకంగా 41వేల రూపాయల ధరలు పలికింది. ఈ ధర రేపోమాపో 50వేల రూపాయలు దాటే అవకాశాలు కల్పిస్తున్నాయి. క్వింటా మిర్చి ధర తులం బంగారంతో సమాంతరమవడంతో రైతులు ఆనందంతో మురిసి పోతున్నారు.

గరిష్ఠ ధరలు నమోదు..
సింగిల్ పట్టి రకం మిర్చి ఒక్కటే కాదు.. దాదాపుగా అన్ని రకాల మిర్చి ధరలు ఇదే విధంగా రికార్డుల మోత మోగుతున్నాయి. బుధవారం మార్కెట్ ధరలు పరిశీలిస్తే సింగిల్ పట్టి మిర్చికి 41000 రూపాయల గరిష్ట ధర ఉండగా, దేశీరకం మిర్చి క్వింటాకు 35,000 రూపాయల ధరలు నమోదయ్యాయి. తేజా రకం మిర్చికి 17,800 రూపాయలు, వండర్ హాట్ క్వింటాకు 23,500 రూపాయలు, టమాటో రకం మిర్చి క్వింటాకు 35,000 రూపాయలు, US 341 రకం మిర్చికి 22,500 రూపాయలు, దీపికా రకం మిర్చికి 23,000 రూపాయల గరిష్ఠ ధరలు నమోదయ్యాయి. ఈ ధరలు మార్కెట్ యార్డు చరిత్రలోనే ఆల్ టైమ్స్ రికార్డు అని వ్యాపారులు, అడ్తిదారులు ఆశ్చర్యపోతున్నారు.

ఈసారి ఆకాల వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గడం.. తెగుళ్లతో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడి అయోమయంలో చిక్కుకున్న రైతులు.. ఊహించని విదంగా రికార్డులు సృష్టిస్తున్న ఈ ధరలు చూసి ఆనందంతో మురిసిపోతున్నారు. పంట నష్టపోయిన తమకు ఈ ధరలు కాస్త ఉపశమనం కల్పిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలోని మిర్చి రైతులు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు చెందిన రైతులు మిర్చి బస్తాలను ఇక్కడికి అమ్మకానికి తీసుకొస్తుంటారు. గత యేడాది 8.67 లక్షల క్వింటాల మిర్చి అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటికే 2.97 లక్షల క్వింటాల మిర్చి అమ్మకానికి వచ్చాయి. మరో లక్ష క్వింటాల వరకు అమ్మకానికి వస్తుందని అంచనాలు వేస్తున్నారు.

రైతు పోరాటాలకు కేరాఫ్..
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డుగా గుర్తింపుంది. ఈ వ్యవసాయ మార్కెట్ యార్డు ఎన్నో రైతు ఉద్యమాలకు పుట్టినిల్లు. వ్యవసాయ సీజన్ వచ్చిందంటే చాలు నిత్యం రణరంగమే. పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు ఉక్కు పిడికిళ్ళు బిగిస్తే.. ఖాకీలు కుళ్ల పొడిచేవారు. ప్రతీ సీజన్‌లో రైతు పోరాటాలను అదుపు చేయడానికి ఇక్కడ పోలీస్ బేస్ క్యాంపునే ఏర్పాటు చేసేవారు.

నిత్యం గిట్టుబాటు ధరల కోసం దద్దరిల్లిన ఈ మార్కెట్ ఇప్పుడు రైతుల ఆనందపు అడుగులతో వారికో దేవాలయంలా తలపిస్తుంది. ప్రకృతి పగబట్టి పంట నష్టం కలిగించినా దేవుడు కరుణించి మంచి ధరలు కల్పించాడని మురిసిపోతున్నారు. ప్రతీ వ్యవసాయ సీజన్లో గిట్టుబాటు ధరల కోసం పిడికిళ్ళు బిగించి పోలీస్ కేసులపాలైన రైతులు ఈసారి రికార్డులు సృష్టిస్తున్న ధరలు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న అన్ని రకాల మిర్చి ధరలు..
సింగిల్ పట్టి, దేశీరకం మిర్చికి మాత్రమే అత్యధిక ధర పలుకుతుంది. గత యేడాది ఇదే మిర్చి రూ. 16 వేల నుంచి17 వేల గరిష్ట ధరలు పలికాయి. కానీ ఈ సీజన్లో రెండింతలు ధర రెట్టింపయ్యింది. మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సింగిల్ పట్టి మిర్చి కేవలం ఎర్రమట్టి నెలలు, గోదావరి పరివాహక ప్రాంతంలోనే సాగు జరుగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10,217 క్వింటాలు మాత్రమే అమ్మకానికి వచ్చింది. మరో 3వేల క్వింటాల వరకు వస్తుందని అంచనాలు వేస్తున్నారు. కానీ ఈ మిర్చికి ఫుల్ డిమాండ్ ఉండడం.. డిమాండ్ కు తగిన పంట దిగుబడి లేకపోవడంతో కచ్చితంగా 50 వేల రూపాయలు దాటుతుందనే ఆశాభావంతో వున్నారు రైతులు.

సింగిల్ పట్టి మిర్చి ప్రత్యేకత ఏంటి..?
మిర్చి ధర క్వింటాకు అర లక్షకు చేరువవడంతో అసలు ఈ మిర్చికి ఇంత డిమాండ్ ఎందుకు..? సింగిల్ పట్టి మిర్చి ప్రత్యేకత ఏంటి..? అనే చర్చ రైతులు, వ్యాపార వర్గాల్లో మొదలైంది. దీనికి మూడు ప్రధాన కారణాలున్నాయి. సింగిల్ పట్టి మిర్చికి స్వదేశీ, విదేశీ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఎర్రగా దగదగలాడే ఈ మిర్చిని మన దేశంలో ఎక్కువగా పచ్చళ్ళ తయారీలో ఉపయోగిస్తారు. ఇక్కడి నుంచి మలేషియా, థాయిలాండ్, చైనా, ఇండోనేషియాతో పాటు మరికొన్ని దేశాలకు ఎగుమతి అవుతుంది. మిర్చి పౌడర్ నుండి తీసే ఆయిల్ ను ఔషధాలు తయారీ, నేయిల్ పాలిష్, కాస్మొటిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. అలాగే పౌడర్‌ను వంటలు ఉపయోగించడంతో పాటు రంగుల తయారీలో ఉపయోగిస్తారు. స్వదేశీ మార్కెట్లో కూడా ఈ మిర్చికి ఫుల్ డిమాండ్ ఉంది. మిర్చి పౌడర్ తయారీ కంపెనీలు కూడా ఈ మిర్చి కోసం పోటీ పడుతున్నారు. అయితే ఈసారి పంట ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం వల్లే మిర్చి ధరలు పసిడికి సమాంతరమయ్యాయంటున్నారు.

కొనుగోలుదారుల మధ్య పోటీ..
పంట దిగుబడి తగ్గడంతో కొనుగోలుదారుల మధ్య పోటీ పెరిగింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా ఈ ఎర్రబంగారం మహా బాగ్యం అంటుండడంతో మిర్చి రైతులకు మంచిరోజులు వచ్చాయి. ఏనుమాముల మార్కెట్ చరిత్రలోనే ఈ ధరలు ఆల్ టైమ్స్ రికార్డు అంటున్న మార్కెటింగ్ శాఖ అధికారులు రైతులకు మంచిరోజులు వచ్చాయంటున్నారు. ఈ ధరలు మరింత పెరగవచ్చంటున్నారు.

రైతు కళ్లల్లో ఆనందం..
మార్కెట్ కు మిర్చి తీసుకువస్తున్నామంటేనే గిట్టుబాటు ధరకోసం పోరాటానికి సిద్ధపడి వచ్చే రైతుల ముఖల్లో ఈసారి చిరునవ్వులు కనిపిస్తున్నాయి. ప్రకృతి పగబట్టి పంటకు నష్టం జరిగినా.. మిగిలిన ఆ కాస్త మిర్చికి మంచి ధరల లభిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఈ ధరలు ఇలాగే కొనసాగితే కచ్చితంగా రైతు రారాజే.

Also read:

Andhra Pradesh: ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ కమిషనర్..

Andhra Pradesh: అటు ఆమెతో.. ఇటు ఈమెతో వ్యవహారం నడిపాడు.. చివరకు అడ్డంగా బుక్కయిన పోలీసు..

Viral Photo : నెట్టింట్లో రచ్చ చేస్తోన్న ఫోటో.. జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు.. ఇదేంటో మీరేమైనా కనిపెట్టగలరా?..