
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వేడెక్కింది. నగరంలోని ప్రీమియం ప్రాంతాల్లో భూముల ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన వేలం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (కేపీహెచ్‌బీ)లోని ఖాళీ ప్లాట్లు, ఫ్లాట్లను వేలానికి పెట్టగా ఊహించని స్థాయిలో బిడ్డింగ్ జరిగింది. ముఖ్యంగా ఒక ఓపెన్ ప్లాట్ గజం ధర ఏకంగా రూ.2.65 లక్షలకు చేరుకోవడం రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ వేలానికి ముందు హౌసింగ్ బోర్డు అధికారులు గజానికి రూ.1.30 లక్షలను అప్‌సెట్ ధరగా నిర్ణయించినప్పటికీ, బిడ్డర్లు పోటాపోటీగా బిడ్లు వేయడంతో ధర రెట్టింపు దాకా ఎగిసిపోయింది. కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు పరిధిలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గజం ధర ఇదేనని అధికారులు తెలిపారు. ఈ వేలంలో మొత్తం 40 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఫేజ్–1, ఫేజ్–2లోని ధర్మారెడ్డి కాలనీలో ఉన్న నాలుగు ఓపెన్ ప్లాట్లు తీవ్ర పోటీ మధ్య భారీ ధరలకు అమ్ముడయ్యాయి. పరిమిత సంఖ్యలో ప్లాట్లు ఉండటమే ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. అదేవిధంగా ఫేజ్–15లోని సంపూర్ణం అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఎనిమిది ఫ్లాట్లను కూడా వేలంలో విక్రయించారు.
సుమారు 1400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక ఫ్లాట్ అత్యధికంగా రూ.1.10 కోట్లకు అమ్ముడైంది. వీటి అప్‌సెట్ ధర రూ.90 లక్షలుగా నిర్ణయించగా, బిడ్డర్ల పోటీ కారణంగా ధరలు గణనీయంగా పెరిగాయి. మొత్తంగా ఈ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.24.26 కోట్ల ఆదాయం లభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయ వనరుగా నిలవడమే కాకుండా, కేపీహెచ్‌బీ ప్రాంతానికి నగరంలో ఉన్న అధిక డిమాండ్‌ను స్పష్టంగా ప్రతిబింబించింది. హైదరాబాద్‌లో భూముల ధరలు ఇంకా ఎక్కడికి చేరతాయో అన్న చర్చ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో జోరందుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..