
హైదరాబాద్: తల్లిదండ్రులు లేని చిన్నారులకు కొత్త కుటుంబాలు దొరుకుతున్నాయి. పిల్లలు లేని దంపతులు అనాథ చిన్నారులను అక్కున చేర్చుకుంటూ వారికి ప్రేమ, ఆప్యాయతలతో కూడిన జీవితాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలో దత్తతల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా పెరగడం విశేషంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 307 మంది చిన్నారులు దత్తతకు వెళ్లారు. గత పదేళ్లలో ఇదే అత్యధిక సంఖ్య. దత్తతపై సమాజంలో ఒకప్పుడు ఉన్న అపోహలు, చిన్నచూపు క్రమంగా తగ్గిపోవడంతో ఎక్కువ మంది దంపతులు చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవడానికి ముందుకొస్తున్నారు.
దత్తత పొందిన 307 మంది చిన్నారుల్లో 277 మందిని దేశీయ దంపతులు అక్కున చేర్చుకున్నారు. వీరిలో 44 మంది పదేళ్లకు పైబడిన పిల్లలు కూడా ఉండటం గమనార్హం. చిన్న వయసు పిల్లలతో పాటు పెద్ద వయసు పిల్లలను కూడా దత్తత తీసుకునేందుకు దంపతులు ఆసక్తి చూపిస్తున్నారు.
మరో 30 మంది చిన్నారులను విదేశాల్లో నివసిస్తున్న కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు కుటుంబం దొరకడం ఆశాజనక పరిణామంగా అధికారులు చెబుతున్నారు. మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న 29 మంది స్పెషల్ నీడ్స్ చిన్నారులను విదేశీ దంపతులు దత్తత తీసుకోవడం విశేషం.
రాష్ట్రంలో దత్తతల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 150 మంది చిన్నారులు దత్తతకు వెళ్లగా, 2023-24లో 166 మంది, 2024-25లో 220 మంది, 2025-26లో 307 మంది చిన్నారులు కొత్త కుటుంబాల్లోకి అడుగుపెట్టారు. ఈ గణాంకాలు దత్తతల పట్ల ప్రజల్లో పెరుగుతున్న సానుకూల దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
గతంలో దత్తత తీసుకోవడంపై అనేక సందేహాలు ఉండేవి. దీంతో అనాథ చిన్నారులు శిశు గృహాల్లోనే ఏళ్ల తరబడి గడపాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. పిల్లలను దత్తత తీసుకోవడం సామాజికంగా కూడా ఆమోదయోగ్యంగా మారుతోంది.
అక్రమ పద్ధతుల్లో పిల్లలను దత్తత తీసుకోవడం నేరమని, తప్పనిసరిగా చట్టబద్ధ విధానంలోనే దత్తత ప్రక్రియ పూర్తి చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 55 అడాప్షన్ హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ డెస్కుల ద్వారా దత్తతపై ఆసక్తి ఉన్న దంపతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరింత మంది చిన్నారులకు కుటుంబ ప్రేమ అందించాలనే లక్ష్యంతో వచ్చే ఏడాది కనీసం 350 మంది పిల్లలను దత్తతకు ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది.