
రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 27 గురువారం నుంచి ఆగస్టు 31 సోమవారం వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 26న మిలాద్-ఉన్-నబీ, ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి, ఆగస్టు 30న ఆదివారం సెలవు రావడంతో పండుగకు ముందే ప్రయాణికుల రద్దీ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. అలాగే తిరుగు ప్రయాణాల రద్దీ ఆగస్టు 30 ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆగస్టు 31 సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు.
గత ఏడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా 4,760 ప్రత్యేక బస్సులను నడిపించగా, ఈ ఏడాది ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 240 బస్సులను అదనంగా పెంచి మొత్తం 5,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. గత ఏడాది ప్రత్యేక బస్సుల ద్వారా సుమారు 3.68 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించగా, అందులో 2.51 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రద్దీ ఉన్న ప్రాంతాలకు అదనపు బస్సులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
రాఖీ పౌర్ణమి, తిరుగు ప్రయాణాల రద్దీ నేపథ్యంలో అవసరమైన చోట అదనపు బస్సులను నడపడంతో పాటు ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మహిళా ప్రయాణికులకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. పండుగ రద్దీ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు సమష్టిగా, ఓర్పుతో విధులు నిర్వహిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించేలా టీజీఎస్‌ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.