3 ఏళ్లు దాటాక కూడా ప్రామిసరీ నోట్‌తో డబ్బులు వసూలు చేయొచ్చు.. ఎలాగంటే..?

ప్రామిసరీ నోట్ గడువు మూడేళ్లు దాటిన తర్వాత అది చెల్లదని చాలామంది నమ్ముతారు. అయితే నిర్దిష్ట కారణాలున్నప్పుడు ఈ గడువు తర్వాత కూడా కోర్టులో కేసు వేసి డబ్బులు వసూలు చేసుకోవచ్చు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆ డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం ..

3 ఏళ్లు దాటాక కూడా ప్రామిసరీ నోట్‌తో డబ్బులు వసూలు చేయొచ్చు.. ఎలాగంటే..?
Promissory Note

Updated on: Jul 19, 2026 | 5:02 PM

ప్రామిసరీ నోట్ గడువు గురించి సమాజంలో విస్తృతంగా నెలకొన్న అపోహలను తొలగించేందుకు ఈ కథనం ఉపయోగపడుతుంది. చాలామంది ప్రామిసరీ నోట్ రాసుకున్న తర్వాత మూడేళ్ల గడువు ముగిస్తే అది చెల్లదని, డబ్బులు రికవరీ చేసుకోవడం అసాధ్యమని భావిస్తారు. అయితే, ఈ సాధారణ నియమానికి కొన్ని ముఖ్యమైన మినహాయింపులు ఉన్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు.

ప్రామిసరీ నోట్ అంటే ఏమిటి?

సాధారణంగా, ఆర్థిక అవసరాల నిమిత్తం స్నేహితులు, బంధువులు లేదా వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్నప్పుడు, దానికి హామీగా ప్రామిసరీ నోట్ రాస్తుంటారు. నేను ఫలానా వ్యక్తి నుంచి అప్పు తీసుకున్నాను. దాన్ని ఈ షరతులతో తిరిగి చెల్లిస్తాను అని పేర్కొంటూ రాసే పత్రాన్ని ప్రామిసరీ నోట్ అంటారు. దీనికి ప్రత్యేకమైన ముద్రించిన ఫార్మాట్ ఏమీ ఉండదు. అప్పు తీసుకున్నాను, తిరిగి చెల్లిస్తాను, షరతులు అనేవి స్పష్టంగా ఉంటే అది ప్రామిసరీ నోట్ కిందకే వస్తుంది.

సాధారణ నియమం: మూడేళ్ల పరిమితి

ప్రామిసరీ నోట్‌పై తేదీ రాసిన తర్వాత, ఆ తేదీ నుంచి మూడేళ్ల లోపు అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బులు చెల్లించకపోతే, అప్పు ఇచ్చిన వ్యక్తి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మూడేళ్ల గడువు దాటితే కేసు వేయడానికి అవకాశం ఉండదు, ప్రామిసరీ నోట్ చెల్లదు అనేది సాధారణంగా అందరికీ తెలిసిన, చాలామంది అడ్వకేట్లు చెప్పే నియమం. ప్రజల్లో కూడా ఇదే అవగాహన ఉంది.

మినహాయింపులు: మూడేళ్ల తర్వాత కూడా చెల్లుబాటు

అయితే, ఈ మూడేళ్ల పరిమితి అనేది సాధారణ లిమిటేషన్ మాత్రమే అని నిపుణులు వివరించారు. దీనికి మినహాయింపులు (ఎగ్జెంప్షన్స్) ఉంటాయట. మూడేళ్ల గడువు దాటిన తర్వాత కూడా అదే ప్రామిసరీ నోట్‌ను ఉపయోగించి కోర్టులో కేసు వేయవచ్చు, అది ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుంది.

ఆలస్యానికి నమ్మదగిన కారణాలు

కేసు వేయడంలో జరిగిన ఆలస్యానికి సరైన, నమ్మదగిన కారణాన్ని కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. “ఆయన ఇస్తానని చెప్పాడు, నమ్మకంతో వేచి చూశాను” వంటి సాధారణ కారణాలను కోర్టులు అంగీకరించవు. కోర్టులు మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉన్న నమ్మదగిన కారణాలు ఈ విధంగా ఉంటాయి:

తీవ్ర అనారోగ్యం లేదా ఆసుపత్రి పాలవడం

మానసిక ఆరోగ్య సమస్యలు

కుటుంబంలో ఎవరైనా మరణించడం

ప్రమాదానికి గురవడ

దేశంలో లేకపోవడం (ఉదాహరణకు, విదేశాలకు వెళ్లినప్పుడు, అకస్మాత్తుగా యుద్ధం వంటి పరిస్థితుల వల్ల తిరిగి రాలేకపోవడం).

ఉదాహరణకు, ప్రామిసరీ నోట్ గడువు ఇంకో మూడు నెలల్లో ముగుస్తుండగా, ఒక వ్యక్తి విదేశాలకు వెళ్లాడు అనుకుందాం. అకస్మాత్తుగా యుద్ధం వల్ల విమానాలు రద్దై అతను తిరిగి రాలేకపోయాడు. ఇలాంటి సందర్భంలో, అతని నియంత్రణలో లేని కారణం వల్ల ఆలస్యం జరిగిందని కోర్టు నమ్మితే, మినహాయింపును ఇస్తుంది.

కాబట్టి, ప్రామిసరీ నోట్ గడువు మూడేళ్లు దాటినప్పటికీ, ఆలస్యానికి సరైన, నమ్మదగిన కారణాన్ని కోర్టుకు వివరించగలిగితే, కోర్టు పర్మిషన్ తో కేసును స్వీకరించి, బాకీ ఉన్న డబ్బులను వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కీలక సమాచారం ప్రజలకు ప్రామిసరీ నోట్ లపై ఉన్న అపోహలను తొలగించి, న్యాయ సహాయాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది.

 

(ఈ సమాచారం ప్రముఖ న్యాయ నిపుణులు నుంచి సేకరించాం. మీకు ఎలాంటి లీగల్ సమస్యలు ఉన్నా న్యాయవాదులను సంప్రదించండి)

Follow Us