నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాంగ్రెస్ విజయభేరీ బహిరంగసభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ముందుగా క్రికెట్ అభిమానులను ఆకర్షించేందుకు ప్రపంచ కప్ ప్రస్తావనను తీసుకొచ్చారు. ఈ రోజు క్రికెట్ ప్రపంచ కప్ ఉంది భారత్ ప్రపంచ కప్ గెలవాలని అందరూ కోరుకుందామన్నారు. మా నానమ్మ ఇందిరా గాంధీని ప్రతి గ్రామంలో ఇంకా ఎందుకు గుర్తు చేసుకుంటున్నారో తెలుసా.. వాళ్ళు చేసిన మంచి పనులే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే జాబ్ క్యాలండర్ రిలీజ్ చేస్తామన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మీరు మాత్రం కేసీఆర్, కేటీఆర్ కు ఉద్యోగాలు ఇవ్వకండి చాలు అని వ్యంగాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్ అదికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్ అంతా తప్పులు తడకగా ఉంది.. ఇలాంటి ధరణిని బంద్ చేసి భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. బీజేపీ పెద్ద కంపెనీల దోస్తాతో దేశాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు. దేశంలో మోడీ.. తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు ప్రజల రక్తం తాగుతున్నారని ఘాటుగా స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు ఒక్కటే.. పక్కపక్కనే ఉంటూ నాటకాలు వేస్తున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలు, గృహిణుల కష్టాలు తీరుస్తామన్నారు. రూ. 500 కి గ్యాస్ సిలెండర్ ఇస్తాం.. కర్ణాటక తరహాలో తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు అంటూ తొమ్మిదేళ్లుగా మోసం చేశారు. మా పార్టీ అధికారంలోకి రాగానే పక్కా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. 10లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు యువ వికాసం స్కీం తీసుకొస్తామన్నారు. ప్రతి జిల్లాలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి తెలంగాణలో అభివృద్ది అంటే ఏంటో చూపిస్తామని హామీలు ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..