
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన రావుల మారుతి ప్రసాద్ అనే వ్యక్తికి ఖమ్మం జిల్లాకు చెందిన మౌనిక అనే యువతితో సుమారు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. గత నెల 12వ తారీఖున మౌనికను భర్త, మామ.. ఇద్దరు కలిసి మంథనిలో వారి ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో మౌనిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం తల్లిదండ్రుల వద్దకు ఖమ్మం జిల్లాకు వెళ్లిపోయింది.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నెల రోజులు గడుస్తున్నా పోలీసులు కనీసం చర్యలు తీసుకోవడం లేదని మౌనిక ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరగడం లేదని.. తనకు ఒక బాబు ఉన్నాడని.. ప్రస్తుతం మళ్లీ ఏడు నెలల గర్భవతినని ఆవేదన వ్యక్తం మంథని అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించింది.
మౌనిక మీడియాతో మాట్లాడుతూ… తన భర్త ఏ పనిలేక ఖాళీగా తిరుగుతూ తాగి వచ్చి కట్నం కోసం వేధిస్తున్నాడని, మామ దగ్గరకి వెళ్లమని చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ ఆరోపించింది. మంథని పోలీస్ స్టేషన్లో గత నెల 12 న ఫిర్యాదు చేశానని , నెల రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది .సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మౌనికను మంథని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..