
ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ మండలం అల్లికోరి పంచాయతీలోని పొట్టంలొద్ది మారుమూల కుగ్రామం. సుమారు 50 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. కానీ ఈ చిన్న గ్రామంలో ఏకంగా 250కి పైగా పశువులు, మేకలు ఉన్నాయి. వాటిని గ్రామస్థులు కేవలం జీవాలుగా మాత్రమే చూడరు. తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ప్రతిరోజూ పశువులను మేతకు తీసుకెళ్లేందుకు గ్రామమంతా కలిసి ముగ్గురు కాపరులను ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం పశువులు మేతకు వెళ్లడం.. సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకోవడం అక్కడ నిత్యకృత్యం. పశువుల పెంపకం విషయంలో గ్రామస్థులు తీసుకునే శ్రద్ధ చూస్తే.. నిజంగానే ఇది ‘పశుసంపదను కంటికిరెప్పలా కాపాడుకునే ఊరు’ అనిపించకమానదు.
ఇక్కడ పాలు అమ్మరు.. పంచుతారు
ఈ గ్రామానికి అసలు ప్రత్యేకత ఇక్కడే మొదలవుతుంది. పశువుల నుంచి ఎంత పాలు వచ్చినా వాటిని పాల కేంద్రాలకు తీసుకెళ్లరు. మార్కెట్‌లో విక్రయించరు. పాల వ్యాపారం అనే మాటే ఈ గ్రామంలో కనిపించదు. ఒకరి ఇంట్లో పాలు ఎక్కువగా ఉంటే.. అవసరమైన వారికి ఇస్తారు. మరో ఇంట్లో పాలు ఎక్కువైతే ఇంకొకరికి పంచుతారు. ఇలా గ్రామంలోనే పాలు ఇచ్చిపుచ్చుకుంటారు.
అందుకే గ్రామస్థుల మాటల్లో.. మా ఊర్లో పాలు అమ్మకం కాదు.. ఆప్యాయత అంటారు.
ఊరు పుట్టినప్పటి నుండి ఒక్క పాల ప్యాకెట్ కూడా కొనలేదట
ప్రస్తుతం పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఇంటికీ పాల ప్యాకెట్లు చేరుతున్నాయి. అత్యవసర సమయంలో ఆ ప్యాకెట్లే దిక్కవుతున్నాయి. కానీ పొట్టంలొద్ది గ్రామంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. “ఇప్పటివరకు ఒక్క పాల ప్యాకెట్ కూడా కొనుక్కోలేదు” అని గ్రామస్థులు చెబుతున్నారు. ఎందుకంటే వారికి కావాల్సిన పాలు వారి ఇళ్లలోనే ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసు.. ఎలా పెంచిన పశువులవో తెలుసు.. కల్తీ భయం లేదు.
పేడ కూడా విలువైనదే
ఈ గ్రామస్థుల జీవన విధానంలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. పశువుల పేడ, మూత్రాన్ని వృథాగా పారబోసరు. వాటితో సేంద్రియ ఎరువులు తయారు చేసుకుని వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. దీంతో రసాయన ఎరువుల వినియోగం కూడా చాలా తక్కువగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. అంటే.. పశువుల నుంచి పాలు మాత్రమే కాదు.. పంటలకు ఎరువు కూడా.
కల్తీ పాల కాలంలో.. స్వచ్ఛతకు చిరునామా
ప్రస్తుతం పాలలో కల్తీపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీరు, పిండి పదార్థాలు, డిటర్జెంట్లు, యూరియా వంటి పదార్థాలతో పాలను కల్తీ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ పొట్టంలొద్ది గ్రామస్థులకు ఆ భయం లేదు. ఎందుకంటే వారి పాలు.. వారి పశువుల నుంచే వస్తాయి. పాల ప్యాకెట్‌పై ఏ కంపెనీ పేరు ఉందో వారికి తెలియకపోయినా.. ఆ పాలు ఇచ్చిన ఆవు లేదా గేదె ఎవరిదో మాత్రం తెలుసు. అందుకే ఈ గ్రామం నేటి కాలంలోనూ స్వచ్ఛమైన జీవన విధానానికి ఓ చిన్న ఉదాహరణగా నిలుస్తోంది.
ప్యాకెట్ పాల యుగంలో.. పంచుకునే పాల సంస్కృతి
ఒకవైపు పాలు కొనుక్కునే ప్రపంచం.. మరోవైపు పాలు పంచుకునే ఈ పల్లె. ఒకవైపు పశువులను కేవలం ఆదాయ వనరుగా చూసే విధానం.. మరోవైపు వాటిని కుటుంబ సభ్యులుగా భావించే మనస్తత్వం. పశువులను ప్రేమిస్తే అవి పాలు ఇస్తాయి.. పాలను పంచుకుంటే ఆప్యాయత పెరుగుతుంది.. పేడను భూమికి ఇస్తే పంట తిరిగి పుడుతుంది. ఇదే పొట్టంలొద్ది గ్రామం చెబుతున్న సందేశం. పాల ప్యాకెట్‌కు దూరంగా.. కల్తీకి ఆమడ దూరంగా.. పశుసంపదకు దగ్గరగా.. పంచుకునే మనసుతో జీవిస్తున్న ఈ చిన్న గ్రామం నిజంగా ఓ ఆదర్శ గ్రామమే కదా.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.