నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో అధికార పార్టీకి చెందిన ఎంఎల్ఎ జైపాల్ యాదవ్, ఎంఎల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తన కోరిక తీర్చుకోవాలనుకుంటున్నారట కసిరెడ్డి. అందుకే ఈ మధ్య కాలంలో కల్వకుర్తికి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లను హైదరాబాద్ కు తీసుకెళ్లి మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పారట. అంతేగాక ప్రతీ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ నిత్యం జనం లో ఉండే ప్రయత్నం చేస్తున్నారట కసిరెడ్డి నారాయణ రెడ్డి. అయితే, ఇంతలా తాపత్రయపడుతున్నా.. అధికారులు మాత్రం ఆయన్ని పట్టించుకోవడం లేదంట.. ఇది జీర్ణించుకోలేక పోతున్న కసిరెడ్డి..పబ్లిక్‌గానే తన కోపాన్ని బయటపెట్టారు.
అదీ లెక్క. అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎందుకు ఇవ్వడం లేదని ఆ అధికారిని అందరి ముందే కడిగేశారు. తలకొండ పల్లిలో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జనం ముందే.. ఎంపీడీఓ పై అసహనం వ్యక్తం చేశారు. అంతకన్నా ముందు వెల్దండ లో జరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోనూ అధికారులు తనకు సమాచారం ఇవ్వకుండా అవమానిస్తున్నారని గట్టిగనే క్లాస్ పీకారట. తాను కూడా ప్రజాప్రతినిధినే..ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడిన లీడర్‌నే..పైగా మూడు జిల్లాలకు ఎంఎల్సీనని..గుర్తు చేసి మరీ క్లాసు పీకుతున్నారట. ట్విస్ట్ ఏంటంటే..ఈ రెండు ఘటనలు ఎంఎల్ఎ జైపాల్ యాదవ్ సమక్షంలోనే జరిగాయి. దీన్ని బట్టి చూస్తే కల్వకుర్తి అధికార పార్టీలో ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.
కల్వకుర్తిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ..ఒకరికే సమాచారం ఇవ్వడమేంటని కసిరెడ్డి మండిపోతున్నారు. కార్యక్రమాలకు వచ్చినా రాకపోయినా.. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందేనని..అది ప్రొటోకాల్ అని కూడా చెబుతున్నారట. దీంతో..ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఎన్నికల నాటికి ఎలా ఉంటుందోనని ఇరువర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం