Telangana Politics: ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎటువైపు.. సీఎం రేవంత్‌తో భేటీ వెనుక అసలు కథ ఏంటి?

ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారంనాడు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఈ నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ కావడంతో ఆసక్తికర ఎపిసోడ్‌కు తెరలేచింది. బీఆర్ఎస్‌లో అయితే ఈ వ్యవహారం కొంత అలజడి సృష్టించినట్లు తెలుస్తోంది.

Telangana Politics: ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎటువైపు.. సీఎం రేవంత్‌తో భేటీ వెనుక అసలు కథ ఏంటి?
BRS MLAs Meets CM Revanth Reddy

Edited By: Janardhan Veluru

Updated on: Jan 25, 2024 | 12:58 PM

నలుగురు భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వ్యవహారంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆ ఎమ్మెల్యేలు స్వయంగా మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చినా.. ఆ ఎమ్మెల్యేలపై అనుమానపు నీడలు ఇంకా తొలగలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారంనాడు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్‌ను వారు కలిసిన వెంటనే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు జంప్ అవుతున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.  ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఈ నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ కావడం ఆసక్తికర ఎపిసోడ్‌కు తెరలేచింది. బీఆర్ఎస్‌లో అయితే ఈ వ్యవహారం కొంత అలజడి సృష్టించినట్లు తెలుస్తోంది. అందులోనూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇద్దరు కూడా కేసీఆర్, కేటీఆర్‌లకు సన్నిహితులు. ఇక నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని మరి టికెట్ కేటాయించారు. మరో ఎమ్మెల్యే మాణిక్ రావు కూడా బీఆర్ఎస్ పెద్దలతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందులోనూ హరీష్ రావుకు మంచి గ్రిప్ ఉన్న మెదక్ జిల్లా నుంచి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలవడాన్ని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో బుధవారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మరీ.. పార్టీ మారడం లేదు.. ఇదంతా పుకార్లే అంటూ మీడియాపైనే ఫైర్ అయ్యారు. పార్టీ మారే అవకాశమే లేదని కొట్టి పారేశారు. కానీ చాలా ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాలు క్యాడర్‌ని సంతృప్తి పరిచేలా లేవంటూ సొంత పార్టీ వర్గాల్లోనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రిని కలుస్తున్నట్లుగా నలుగురు ఎమ్మెల్యేలు అధిష్టానానికి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం.. కనీసం సీఎంతో భేటీ అనంతరం అటు హరీష్‌ను కానీ ఇటు కేటీఆర్‌ను కానీ కలిసి విషయాన్ని వివరించకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.

ప్రోటోకాల్ అంశం, నియోజకవర్గాల అభివృద్ధి, సెక్యూరిటీ పెంపు అంశాలకు సంబంధించే విన్నవించేందుకే తాము సీఎం రేవంత్‌ను కలిసినట్లు ఆ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. నిజానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ ఎదుర్కొనే సమస్య ఇది. ఈ విషయంలో ప్రభుత్వానికి తమ అభ్యర్థనను తీసుకెళ్లాలంటే.. పార్టీ పరంగా అందరూ కలిసి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అయితే నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లి సీఎంను కలవడాన్ని బీఆర్ఎస్ అధిష్టానం కూడా తేలిగ్గా తీసుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారంతో రేవంత్ రెడ్డి  ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారన్న ప్రచారం కూడా మొదలయ్యింది.

సీఎం రేవంత్‌తో భేటీపై నలుగురు ఎమ్మెల్యేలు చెబుతున్న కారణాలు ఎలా ఉన్నా… ఈ పరిణామాలపై బీఆర్ఎస్ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకి పార్టీ హైకమాండ్ ఈ వ్యవహారంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. వాళ్లందరూ మా వాళ్లే.. పార్టీలోనే కొనసాగుతారని పార్టీ అధిష్టానం ప్రకటన చేసే వరకు నలుగురు ఎమ్మెల్యేలపై అనుమాన నీడలు వీడే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందోనని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.