టమాటా రేటు తగ్గినా ఇంకా నేనే రారాజునంటోంది. నేల పాలైతేనేం నాకు భద్రత కల్పించి తీరాల్సిందే అన్నట్టుగా దర్జా ఒలకబోస్తోంది. ఈ మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ లో వరుస రోడ్డు ప్రమాదాల్లో భారీగా టన్నులకు టన్నులు టమాటలు నేలపాలవడం.. వాటికి పోలీసులు భద్రత కల్పించడం కామన్ గా మారింది. తాజాగా అలాంటి ఘటనే కొమురంభీం జిల్లాలో మరొసారి చోటు చేసుకుంది. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బూర్గుడ గ్రామం వద్ద నాలుగు వరుసల రహదారిపై టమాటా లోడుతో వెళుతున్న ఐచర్ వ్యాన్ బోల్తా పడింది. మూలమలుపు వద్ద బైక్ ను తప్పించపోగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి, వ్యాన్ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.
వెంటనే స్థానిక అంబులెన్స్ లో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే నేల పాలైన టమాటాలను ఎవరు ఎత్తుకెళ్లకుండా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బందోబస్తు చేపట్టారు. టమాటాలు దొంగతనం కాకుండా కాపాల కాస్తున్నారు. టమాట కు రేటు తగ్గినా వరుస రోడ్డు ప్రమాదాల్లో ఇలా టమాట నేలపాలవడం.. పోలీసులు కాపల కాయడం కామన్ గా మారింది. అయితే కొన్ని రోజుల నుంచి టమాటా ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో ధరలు మండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కిలోకు 100 రూపాయల టమాటాలు ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో 200 రూపాయలు కిలో ఉంది. అలాగే ఇంకొన్ని చోట్ల ఏకంగా కిలో టమాట ధర 300 రూపాయల వరకు వెళ్లింది. ఇటీవల చాలమంది టమాటాలు కొనడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సామన్యులు పెరిగిన టమాటా ధర పెరుగుదల వల్ల అవస్థలు ఎదుర్కొన్నారు.
ఇక మరో విషయం ఏంటంటే ఆమాంతం పెరిగిపోయిన టమాటా ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. పెరిగిన ధరల వల్ల కొంతమందైతే టమాటాలను వినియోగించడమే మానేశారు. గత మూడు, నాలుగు రోజులుగా ఈ టమాటా ధరలు తగ్గుతున్నాయి. అయితే దిగుమతి పెరగడం వల్లే టమాటా ధరలు తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కూడా టమాటాల రాక పెరగడం వల్ల ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. నగరంలోని పలు రైతు బజారుల్లో కిలో టమాటాల ధర 63 రూపాయల నుంచి 70 రూపాయలు పలుకుతోంది. ఇక రిటైల్ విషయానికి వస్తే అక్కడ కిలో టమాటా ధరలు 120 నుంచి 140 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో ఇప్పుడు సామాన్యులు కూడా కాస్త ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు టమాటా ధరలు తగ్గడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..