
గంజాయిపై తెలుగు రాష్ట్రాల పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల పత్తి, కంది పంటల మాటున గంజాయి సాగు చేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో డ్రోన్లతో డేగ కన్నేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలో పత్తి, కంది పంటల్లో గంజాయి సాగు గుట్టురట్టు అయింది. దీంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. పత్తి, కంది పంటల్లో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే.. గంజాయి సాగు కట్టడికి డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పత్తి, కంది పొలాల్లో డ్రోన్లతో సర్వే చేశారు. పత్తి, కంది పంటలను డ్రోన్లతో జల్లెడ పట్టారు.
అల్లూరి జిల్లా పాడేరులోనూ గంజాయి కట్టడికి పోలీసులు డ్రోన్లు వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి.. గంజాయి వ్యాపారుల కదలికలను డ్రోన్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పాడేరు ఏజెన్సీలో వ్యాపారాలు చేస్తున్నవారిపై నిఘా పెడుతున్నారు. తాజాగా.. పాడేరు సమీపంలోని నడిమివీధి, చింతలవీధి, గొందూరు, బొక్కెళ్ళు గ్రామాల్లో పోలీసులు డ్రోన్లతో తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల ఇళ్లల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా.. సరైన గుర్తింపు పత్రాలు లేకుండా ఇల్లు, షాపులు అద్దెకు ఇవ్వొద్దని స్థానికులకు అల్లూరి పోలీసులు సూచించారు.
కొమురం భీ ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఏజెన్సీలోని మారుమూల గ్రామాలను లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్న గంజాయి దళారులు.. అమాయక రైతులకు డబ్బులు ఆశ చూపి అంతర పంటగా గంజాయి సాగు చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న కొమురం భీం జిల్లా పోలీసులు.. పత్తి, కంది పంటల్లో గంజాయి సాగుపై కొద్దిరోజుల క్రితం డ్రోన్లతో మెరుపు దాడి చేశారు. కొమురం భీం జిల్లాలో స్వయంగా ఏఎస్పీనే రంగంలోకి దిగి.. కెరిమెరి మండలం నారాయణగూడలో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..