Y. S. Sharmila: వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. క్షీణించిన ఆరోగ్యం.. అపోలో ఆస్పత్రికి తరలింపు..

|

Dec 11, 2022 | 8:12 AM

గత రెండు రోజులుగా హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ షర్మిల చేస్తున్న ఆమరణ దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం విషమిస్తుండటంతో ఒంటిగంట ప్రాంతంలో పోలీసులు లోటస్‌పాండ్‌కు చేరుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆమెను వైద్యం నిమిత్తం జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు.

Y. S. Sharmila: వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. క్షీణించిన ఆరోగ్యం.. అపోలో ఆస్పత్రికి తరలింపు..
Y. S. Sharmila
Follow us on

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో అరెస్ట్ చేసి ఆమె దీక్షను భగ్నం చేసి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం షర్మిలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో అర్ధరాత్రి లోటస్‌పాండ్ వద్ద హైటెన్షన్ నెలకొంది. షర్మిలకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అపోలో ఆస్పత్రికి తరలించిన తర్వాత చికిత్స చేయించుకునేందుకు వైఎస్ షర్మిల నిరాకరించారు. వైఎస్ విజయమ్మ అపోలో ఆస్పత్రికి చేరుకుని షర్మిలను పరామర్శించారు. అనంతరం ఆమె తిరిగి లోటస్‌పాండ్‌కు వెళ్లారు. అపోలో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

షర్మిలకు వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత, ప్రవీణ్ బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. షర్మిల ఆరోగ్యం క్షీణించిందని, ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో షర్మిలను బలవంతంగా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల పాటు మంచినీళ్లు కూడా తీసుకోకపోవడంతో షర్మిల ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. యూరియా, బీపీ, గ్లూకోజ్ లెవల్స్ భారీగా పడిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. లాక్టేట్ లెవల్స్ బాగా పెరిగాయని.. శరీరం డీహైడ్రేషన్ అయినట్లు వెల్లడించారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

షర్మిలను చూసేందుకు తల్లి విజయలక్ష్మి అపోలో ఆస్పత్రికి వచ్చారు. అంతకు ముందు షర్మిల మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం ఖూనీ చేస్తున్నారన్నారు. పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్లు పెట్టి సామాన్యులను కూడా రానివ్వడం లేదని, పాదయాత్రలో ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం