
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన విద్యార్థుల అస్వస్థత ఘటన వెనుక అసలు కథ అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.. ప్రభుత్వ ఉపాధ్యాయుల మధ్య విభేదాలే ఆ విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తెచ్చినట్టు జిల్లా కలెక్టర్ పరిశీలనలో తేలింది.. విద్యార్థులు తాగే వాటర్ ట్యాంక్ లో పురుగుల మందు కలిపినట్లుగా గుర్తించారు.. ఆ దారుణానికి ఒడిగట్టిన ఉపాధ్యాయుడు సహా నలుగురిని సస్పెండ్ చేశారు.. మరోవైపు పోలీస్ విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగింది.. శుక్రవారం కలుషిత మంచినీరు సేవించి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
పిల్లలు అస్వస్థత గురయ్యారని తెలియగానే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే శనివారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.. ఈ ఘటనపై ఆరా తీయడంతో అసలు కథ బయటపడింది. ఇదే పాఠశాలకు చెందిన రాజేందర్ అనే సైన్స్ ఉపాధ్యాయుడు మంచినీటిలో మోనో పురుగుల మందు కలపడంతో విద్యార్థులు ఆ నీటిని తాగి అస్వస్థతకు గురయ్యామని తెలిపారు. పంతులు మధ్య విభేదాల నేపధ్యంలో ఉద్దేశపూర్వకంగానే పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు..
పంతుళ్ల మధ్య గొడవలతో తమను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు..తమను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని తెలిపారు..అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే దీనికి కారణమని ఎమ్మెల్యేకి తెలిపారు. వాళ్ల మధ్య వ్యక్తిగత గొడవ కారణంగా రాజేందర్ అనే ఉపాధ్యాయుడు మంచినీటి ట్యాంకులో మోనో పురుగుల మందు కలిపి అనుమానం రాకుండా చేసేందుకు అనంతరం దాన్ని విద్యార్థుల దుప్పట్లపై చళ్లాడని తెలిపారు.. చూసిన విద్యార్థులను బెదిరించి ఈ విషయం బయటికి చెప్తే కొడతానని హెచ్చరించాడని తెలిపారు. రాజేందర్ ఎవరికి అనుమానం రాకుండా అస్వస్థత గురైన విద్యార్థులతో పాటు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేరి వైద్యసేవలు పొందుతున్నాడని తెలిపారు.
విషయం బయటకి తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , ఎస్పీ కిరణ్ కారే హాస్టల్‌ను తనిఖీ చేశారు.. ఈ ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు రాజేందర్‌తో పాటు వేణు, సూర్య ప్రకాష్, వంట మనిషి రాజేశ్వరిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు పోలీస్ కేసులు నమోదుచేసి రిమాండ్ చేస్తామని హెచ్చరించారు.. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ అంతర్గత విబేధాలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి హాస్టల్‌ను ప్రత్యేక అధికారులు, పోలీస్ సిబ్బందితో తనిఖీలుచేసి విద్యార్థులతో ముకాముఖి కావాలని, వారి సమస్యలను తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.