Telangana: మంచిర్యాల జిల్లాలో రెండు గ్రామాల మధ్య పోడు ఫైట్‌.. భూమి మాదంటే మాదంటూ కొట్టుకున్న పోడు రైతులు

పోడు ఫైట్‌..ఈ భూములు మావంటే..మావంటూ గిరిజనుల వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు వర్గాల కొట్లాటతో మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో టెన్షన్‌..టెన్షన్‌ నెలకొంది.

Telangana: మంచిర్యాల జిల్లాలో రెండు గ్రామాల మధ్య పోడు ఫైట్‌.. భూమి మాదంటే మాదంటూ కొట్టుకున్న పోడు రైతులు
Podu Bhumulu

Updated on: Oct 30, 2022 | 8:42 PM

మంచిర్యాల జిల్లాలో మళ్లీ పోడు భూముల వివాదం రాజుకుంది. ఐతే ఈసారి ఫారెస్ట్‌ సిబ్బంది వర్సెస్‌ పోడు రైతులు కాదు. గిరిజనుల మధ్యే చిచ్చు రగిలింది. ఈ భూములు మావంటే మావంటూ గొడవకు దిగారు మంచిర్యాల జిల్లాలో రెండు గ్రామాల ప్రజలు. నెన్నెల మండలం కొనంపేట, వేమనపల్లి మండలం సామేనపల్లి గ్రామాలకు చెందిన రైతులు..భూములు మావంటే మావంటూ వాగ్వాదానికి దిగారు. అది కాస్తా చినికి చినికి గాలివానలా మారింది. పొలాల వద్ద పెద్దసంఖ్యలో గుమిగూడిన మహిళలు..ఒకరినొకరు నెట్టుకున్నారు. పోడు భూముల విషయంలో బాహాబాహీకి దిగారు. ఒకరిపై మరొకరు కారం చల్లుకున్నారు.

తాడోపేడో తేల్చుకోవాల్సిందేనంటూ కొట్టుకున్నారు. కర్రలు, కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 20మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు గ్రామాలకు చెందిన రైతుల కొట్లాటతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఘర్షణ అనంతరం ఇరు గ్రామాల పోడు రైతులు పోలీసు స్టేషన్ కు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

ఐతే చాలాకాలంగా పోడు భూములపై హక్కుల కోసం పోరాడుతున్నారు గిరిజనులు. తమకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ భూములు మావి..మా భూముల నుంచి మమ్మల్ని వేరు చేస్తారా అంటూ..ఫారెస్ట్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగేవారు పోడు రైతులు.

ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు వస్తాయో..రావోనన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా పోడు భూముల సమస్యను అధికార యంత్రాంగం త్వరగా పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం