తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఇళ్లను కేటాయించింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా ఈ స్థాయిలో ఇళ్ల కేటాయింపు జరిగిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దేశవ్యాప్తంగా పేదలకు 2 కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించగా..

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..
PMAY Houses

Edited By:

Updated on: Sep 15, 2026 | 2:14 PM

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు భారీగా ఇళ్లను కేటాయించింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఈ స్థాయిలో ఇళ్ల కేటాయింపు జరగడం ఇదే తొలిసారని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ , కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా పేదలకు రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకోగా ఇందులో ఐదు లక్షల ఇళ్ళను తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది. 2019 -24 మధ్య ఏపీకి 1,78,000 ఇళ్లు కేటాయించగా 42 వేల ఇళ్ల నిర్మాణం పూర్తైంది. మిగతావి పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా ఏపీకి మరో లక్షా 22 వేల ఇళ్ల కేటాయింపు జరిగింది. రానున్న రెండు నుంచి మూడు ఏళ్లలో ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.

తెలంగాణలో గత ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం వద్దనడంతో గతంలో ఎటువంటి ఇళ్ల కేటాయింపులు జరగలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో తెలంగాణలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల ఇళ్లు నిర్మితం కానున్నాయి .. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో లబ్ధిదారుడికి కేంద్రం తరఫున రూ. 1.20 లక్షల ప్రాథమిక ఆర్థిక సహాయం అందనుంది.వివిధ పథకాల అదనపు సాయంతో కలిపి లబ్ధిదారులకు రూ. 1.70 లక్షల నుంచి రూ. 1.80 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఇంటి నిర్మాణంతో పాటు మరుగుదొడ్డి నిర్మాణానికి అదనంగా రూ. 12,000 సహాయం అందించనున్నారు.పేదలకు మరింత మేలు జరిగేలా కేంద్రం అర్హత నిబంధనల్లో పలు సానుకూల మార్పులు చేసింది కుటుంబ నెలసరి ఆదాయ అర్హత పరిమితిని రూ. 10,000 నుంచి రూ. 15,000కు పెంచారు. ఇంట్లో బైక్ లేదా ఫ్రిజ్ వంటి సాధారణ వస్తువులు ఉన్నప్పటికీ పథకానికి అర్హత కోల్పోరని కేంద్రం స్పష్టత ఇచ్చింది. దీనివల్ల ఎక్కువ మంది పేదలు అర్హులుగా మారుతారని అంచనా వేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా జియో ట్యాగింగ్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రజల సౌలభ్యం కోసం సెల్ఫ్ సర్వే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. కొత్తగా మంజూరైన , పెండింగ్‌లో ఉన్న పాత ఇళ్లన్నింటినీ రాబోయే 2-3 ఏళ్లలోగా విజయవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us