
జనగాం జిల్లాలోని పెద్ద రాంచెర్ల గ్రామంలో ఓ ప్రైవేటు వెంచర్‌లో ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ మండలం పెద్ద రాంచెర్ల గ్రామ శివారులో 18 ఎకరాల భూమి ఉండగా.. 12 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లక్ష్మీనారాయణ ప్లాట్లు చేయడం జరిగింది. ఇందులో సుమారు 300 నుండి 350 వరకు ప్లాట్లను చేసి అమ్మకం చేశారు. అంతేకాకుండా ఈ ప్లాట్లలోకి వచ్చే ప్రధాన ద్వారం వద్ద కళాతోరణం ఏర్పాటు చేశారు. ఈ భూమి కొనుగోలులో ఇన్వెస్టర్‌కు సంబంధించిన బయటి వ్యక్తి తల దూర్చాడు. అతను ప్లాట్ల హద్దురాలను, కళాతోరణంను అక్రమంగా కూల్చివేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్లాట్ల యజమానులు.. తాము కొనుగోలు చేసిన భూములలోనికి సంబంధం లేని వ్యక్తులు వచ్చి దౌర్జన్యంగా చొరబడి భూమి హద్దులను మార్చడమే కాకుండా, తోరణాన్ని కూల్చివేశారని బుధవారం ఆందోళన చేపట్టారు. దళారులు, దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.
తమ భూమిలోకి సంబంధం లేని వ్యక్తులు తలదూర్చి అక్రమంగా హద్దురాలను ధ్వంసం చేసిన వ్యక్తుల నుంచి తమ ప్లాట్లకు రక్షణ కల్పించాలి వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, ప్రవీణ్, శేఖర్, సుజాత తదితరులు పాల్గొన్నారు.