Pilot Rohith Reddy: విచారణకు హాజరుకాలేను.. సమయమివ్వండి.. ఈడీకి పైలట్‌ రోహిత్‌రెడ్డి లేఖ..

ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యే క్రమంలో రోహిత్ రెడ్డి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు. ఈ రోజు విచారణకు హాజరుకానంటూ లేఖలో పేర్కొన్నారు.

Pilot Rohith Reddy: విచారణకు హాజరుకాలేను.. సమయమివ్వండి.. ఈడీకి పైలట్‌ రోహిత్‌రెడ్డి లేఖ..
Pilot Rohit Reddy

Updated on: Dec 19, 2022 | 11:26 AM

తెలంగాణ రాజకీయాల్లో కర్ణాటక డ్రగ్స్‌ కేసు కలకలం రేపింది. పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యే క్రమంలో రోహిత్ రెడ్డి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు. ఈ రోజు విచారణకు హాజరుకానంటూ లేఖలో పేర్కొన్నారు. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరారు. ఈనెల 25 వరకు గడువు కావాలంటూ రోహిత్ రెడ్డి లేఖ రాశారు. రోహిత్ రెడ్డికి ఈనెల 16న ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈడీ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి బ్యాంకు సెలవులు ఉన్నాయని రోహిత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కావున, విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 25 వరకు సమయం కావాలని రోహిత్ రెడ్డి లేఖలో వివరించారు.

కాగా.. ఇవాళ ఈడీ విచారణకు హాజరవుతానని పేర్కొన్న రోహిత్ రెడ్డి.. సోమవారం ఉదయాన్నే ప్రగతిభవన్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. న్యాయపరమైన అంశాలపై చర్చిస్తున్నారు. ఈడీ నోటీసులు, న్యాయ సలహాలు, తదితర అంశాలపై మాట్లాడుతున్నారు. ఉదయం ఈడీ విచారణకు బయలుదేరిన రోహిత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుకాలం ముగిసింది. విచారణకు వెళ్తున్నానంటూ కామెంట్‌ చేశారు. అయితే, రోహిత్‌రెడ్డికి ఏ కేసులో నోటీసులిచ్చామన్నది వెల్లడించలేదు ఈడీ. దీంతో రోహిత్‌రెడ్డిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి క్వశ్చన్‌ చేస్తారా..? వ్యాపార లావాదేవీలపైన కూడా ప్రశ్నిస్తారా..? అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. PMLA కింద రోహిత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ..తనతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తీసుకురావాలని ఆదేశించింది. ఆధార్‌, పాస్‌పోర్ట్‌, పాన్‌కార్డ్‌తో పాటు..సేల్‌ డీడ్‌, ఇన్వాయిస్‌ కాపీలు కూడా తేవాలని కోరింది.

ఈ క్రమంలో రోహిత్ రెడ్డి.. కేసీఆర్ ను కలవడం.. ఈడీకి విచారణకు హాజరుకాలేనంటూ లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..