
తెలంగాణ రాజకీయాలు విచారణలు, దర్యాప్తుల చుట్టూ తిరుగుతున్నాయి. మొన్నటిదాకా కాళేశ్వరంపై విచారణ కొనసాగితే.. ఈ నెలలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును విచారించిన సిట్.. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రశ్నించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. ఇప్పటికే ఈ మేరకు నోటీసులు జారీ చేసింది సిట్. కేటీఆర్ సిరిసిల్లలో ఉండటంతో నందినగర్‌లోని ఆయన ఇంట్లో నోటీసులు అందజేశారు సిట్ అధికారులు. అయితే చట్టంపై తమకు గౌరవం ఉందన్న కేటీఆర్.. సిట్ విచారణకు హాజరవుతానన్నారు.
పోలీసులను, ప్రతిపక్షాలను వేధించడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా కేటీఆర్‌కు నోటీసులిచ్చారన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసంతా ట్రాష్ అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రెండేళ్లుగా పెద్ద డ్రామా నడుస్తుందన్నారాయన. బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలను కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టపరంగా చర్యలుంటాయి తప్ప వ్యక్తిగత కక్షసాధింపులు ఉండవన్నారు.