Hyderabad: నో స్టాక్‌.. నగరంలో ఒక్కొక్కటిగా మూతబడుతున్న పెట్రోల్‌ బంక్‌లు!

ఎంకి చావు.. సుబ్బి పెళ్లి కి వచ్చిందనే సామెత మీరందరూ వినే ఉంటారు. ఇప్పుడు మన దేశంలో పరిస్థితికి కూడా అలానే మారింది. అక్కడెక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం మన దేశ ప్రజలపై పడుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇన్నాళ్లు ఎల్పీజీ కొరత ఉంటే.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక హైదరాబాద్‌ శివారులోని కొన్ని పెట్రోల్‌ బంకుల్లో అయితే నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మరికొన్ని రోజులు నగరంలోని పలు బంకులు మూతబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Hyderabad: నో స్టాక్‌.. నగరంలో ఒక్కొక్కటిగా మూతబడుతున్న పెట్రోల్‌ బంక్‌లు!
Petrol Diesel Shortage

Updated on: Mar 20, 2026 | 5:38 PM

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు సుమారు సగానికిపైగా గల్ఫ్‌ దేశాల నుంచే చమురు సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో గల్ఫ్ దేవాల నుంచి వచ్చే చమురు మొత్తం ఆగిపోయింది. దీంతో భారత్ సహా అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడింది. ఇక దిగుమతి తగ్గడంతో ఆటోమేటిక్‌గా పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ పెరిగింది. కాగా డిమాండ్‌కు తగిన సప్లై లేకపోవడంతో ఆయా కంపెనీలు సైతం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా పవర్ పెట్రోల్‌పై రూ.2.26పైసలు పెరగ్గా ఇండస్ట్రియల్ డీజిల్‌పై రూ.22 పెరిగింది. అంతేకాదు రాబోయే రోజుల్లో సాధారణ పెట్రోల్ సైతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

త్వరలో పెరగనున్న సాధరణ పెట్రోల్, డీజిల్ ధరలు!

ఇదిలా ఉండగా నగరం శివారులోని పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమివ్వడంపై, ధరలపై పెరుగుదలపై తెలంగాణా పెట్రోలియం డీలర్స్ ప్రెసిడెంట్ అమరేందర్‌రెడ్డి స్పందిచారు. ప్రస్తుతం పవర్ పెట్రోల్‌పై రూ.2 పెరిగిందని రాబోయే రోజుల్లో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే సాధారణ పెట్రోల్‌పై ఎంత పెరుగుతుంది అనేది వాళ్లకు క్లారిటీ లేదని, డాలర్ విలువ పెరిగిన నేపథ్యంలో చమురు బ్యారేల్‌ ధర కూడా పెరుగుతుందని.. ఆ భారం ప్రభుత్వం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో పెట్రల్, డీజిల్ ధరలు కూడా పెరవచ్చని ఆయన అంచనా వేశారు.

40 శాతం మూతబడిన బంకులు

అయితే గతంలో కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవని దానితో డబ్బులు సరిగ్గా లేకపోయినా ఎలాగోలా బంకులు నడిపించే వారని.. కానీ ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేశాయని.. దానికి తోడు పాత క్రెడిట్ కూడా చెల్లించడంతో పాటు పెట్రోల్, డీజిల్ కావాలంటే అడ్వాన్స్ కూడా కట్టాలంటున్నాయని ఆయన తెలిపారు. తీసుకొచ్చిన ఇందనం అయిపోయే లోపు డబ్బు సమకూర్చడం అంటే డీలర్లకు సాధ్యం కాదని.. ఈ కారణంతోనే దాదాపు 40 శాతం వరకు పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయని తెలిపారు.

అవగాహన కల్పించడం ముఖ్యం

ఇంతకుముందు డీలర్లు అడగకపోయినా ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవని.. కానీ ఇప్పుడు ఇవ్వడం మానేసి వాళ్ల డబ్బులు వసూలు చేసుకునేందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాకరని డీలర్స్ చెబుతున్నారు. దీనికి తోడు రాబోయే రోజుల్లో పెట్రోల్ కొరత ఏర్పడవచ్చనే భయంతో జనాలు ముందే ఎక్కువ మొత్తంలో పెట్రోల్ తీసుకెళ్లడం వల్ల కూడా కొరత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.పెట్రోల్ వినియోగంపై ప్రభుత్వం కూడా ప్రజలకు అవగాహనా కల్పిస్తే ఈ కొరత తగ్గవచ్చని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us