ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా స్పీడు పెంచారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో భేటీ అనంతరం టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. పొత్తులపై కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ పొత్తు గురించి స్పందించని పవన్.. చంద్రబాబుతో భేటీ అనంతరం క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు నుంచి పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తాయి..? బీజేపీ కూడా పొత్తులో భాగమైతే.. ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారు..? సీట్ల పంపకాలు ఎలా జరుగుతాయి..? అంటూ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన.. తెలంగాణపై కూడా కన్నేసింది. ఏపీతోపాటు.. తెలంగాణలో కూడా పోటీచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.. ఈ మేరకు సన్నాహాలను కూడా ప్రారంభించారని.. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడికి ముందే దీనిపై నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాలకు తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా నివేదించినట్లు తెలుస్తోంది. అయితే, జనసేన సింబల్ గ్లాస్ గుర్తును మళ్లీ కేటాయిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్‌ను ఇటీవల ప్రకటించింది. గత కొంతకాలం కిందట గ్లాస్ గుర్తును రద్దు చేసిన ఈసీ.. మళ్లీ అదే గుర్తును కేటాయించడంతో పవన్ కల్యాణ్ ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్‌సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో మళ్లీ జనసేనకు గ్లాస్ సింబల్ కేటాయించడం పట్ల పవన్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో జనసేనకు మళ్లీ గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషకరమంటూ పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ప్రకటించింది. దీంతో అటు ఏపీతోపాటు.. ఇటు తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తున్నట్లు స్పష్టమైంది.
అయితే, ఏపీలో టీటీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో పొత్తులపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ సొంతంగా పోటీ చేయడమా..? లేదా టీడీపీతో పొత్తును తెలంగాణలో కూడా కొనసాగిస్తుందా..? అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే, కొన్ని నెలల క్రితం.. పవన్ కల్యాణ్ తెలంగాణలోని 32 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని.. జనసేన క్యాడర్ లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, తెలంగాణ టీడీపీ కూడా రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతోంది. దానికి తగినట్లుగా క్యాడర్‌ను సిద్ధం చేసుకుంటోంది. అయితే, జనసేన మాదిరిగానే, తెలంగాణలో టీడీపీ ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నది అనే దానిపై స్పష్టత లేదు. దీంతో పోటీపై, సీట్ల పంపకాలపై ఈ రెండు పార్టీల కార్యకర్తల్లో పలు ఊహగానాలు మొదలయ్యాయి. అయితే, దీనిపై జనసేన నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..