ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం కోయచెలక పంచాయతీలో ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న పన్నులు చెల్లిస్తేనే ప్రజా పాలన దరఖాస్తులు అంటూ వాట్సాప్లో పంచాయతీ అసిస్టెంట్ సందేశం పంపారు. అయితే ఆరు పథకాలను ప్రజలకు ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మరో వైపు నో డ్యూ(ఎటువంటి బకాయిలు లేవని) ధ్రువపత్రం ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆన్లైన్ జరుగుతాయని పంచాయతీ కార్యదర్శి గ్రామ వాట్సాప్ గ్రూప్లో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. రఘునాథపాలెం మండలం కోయచెలక ప్రజల వాట్సాప్ గ్రూప్లో పంచాయతీ అసిస్టెంట్ ఇలా సందేశం పెట్టారు.
తెలంగాణ ప్రభుత్వం అందజేసే ఏ పథకం నుంచి లబ్ధి చేకూరాలన్నా నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి.. అంటే గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి పన్నులు బకాయిల్లో లేవు అనే ధ్రువీకరణ పొందుపరచాల్సి ఉంటుంది. తక్షణమే ఇంటి పన్నులు చెల్లించి లబ్ధి పొందండి. ఇంటి పన్నులు చెల్లించిన వెంటనే దరఖాస్తులు ఆన్లైన్ చేస్తామని’ రఘునాథపాలెం మండలంలోని కోయచెలక గ్రామ వాట్సాప్ గ్రూప్లో మెసెజ్ చేశారు. పంచాయతీ కార్యదర్శి ఆదేశంతో అసిస్టెంట్ వాట్సాప్ గ్రూప్ లో సందేశం పంపారు. ఈ వాట్సాప్ సందేశం రఘునాథపాలెం మండలంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో విచారణ నిర్వహిస్తున్న ఎంపీడీవో రామకృష్ణ.. ప్రజలు, ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఎటువంటి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆధార్ నెంబర్, ఉంటే సరిపోతుందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..