Operation Maneater: ఈ మధ్యకాలంలో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద పులుల సంచారం ఎక్కువయ్యాయి. అడవుల నుంచి బయటకు వచ్చి జనావాసాల్లో సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మనిషి రక్తం మరిగిన పులి.. ఏ క్షణం ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే ఓ యువతిని ప్రాణాలను పెద్ద పులి బలిగొన్న విషయం తెలిసిందే. ఇక పశువులపై దాడులు అయితే కనీసం రోజుకు ఒకటైనా వెలుగు చూస్తున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అటవీ అధికారులను వేడుకుంటున్నారు. పులులను ఎలాగైనా బంధించాలని ప్రాధేయపడుతున్నారు.
మరోవైపు పులుల సంచారం ఎక్కువైన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మనిషి రక్తం రుచి మరిగిన పులిని బంధించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఆపరేషన్ మ్యాన్ ఈటర్ హంట్ పేరు వేటను షురూ చేశారు. పులిని బంధించేందుకు షార్ప్ షూటర్ నవాబ్ షపత్‌ను రంగంలోకి దింపాలని ప్లాన్ వేస్తున్నారు. కాగజ్ నగర్ కారిడార్‌లోని అగర్ గూడ, గుండ్ల పల్లి, తలాయి ప్రాంతాల్లో పులిని బందించేందుకు అటవీ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. పులి నివాసం ఉన్న ప్రాంతంలోనే దానిని బందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. అగర్ గూడ, గుండ్ల పల్లి ప్రాంతాల్లో పులి ఆవాస స్థలాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఆ పులి గుండ్లపల్లికి అత్యంత సమీపంలో సంచరిస్తున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. వీలైతే మత్తు మందు ప్రయోగం ద్వారా ఆ మ్యాన్ ఈటర్‌ను బందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక పెద్ద పులిని పట్టుకునేందుకు మహారాష్ట్ర అటవి శాఖ నిపుణుల సాయం కూడా తీసుకునే యోచనలో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి సమాచారం బయటకు లీక్ కాకుండా అధికారులు పక్కా ప్లాన్‌తో ఆపరేషన్ మ్యాట్ ఈటర్ హంట్‌ను మొదలు పెట్టారు. మరి మనిషి రక్తం మరిగిన ఆ బెబ్బులి చిక్కుతుందో లేదో వేచి చూడాలి.
Also read:
మెగాస్టార్ షూటింగ్ లో జాయిన్ కానున్న మెగాపవర్ స్టార్.. జనవరి నుంచి ‘ఆచార్య’ సెట్‌కు చరణ్