Operation Dhulpet : ఫుల్‌స్వింగ్‌లో ఆపరేషన్‌ ధూల్‌పేట్‌.. పారిపోతున్న గంజాయి గ్యాంగ్స్‌

| Edited By: Balaraju Goud

Aug 21, 2024 | 9:46 AM

ఆపరేషన్‌ ధూల్‌పేట్‌ ఫుల్‌ స్వింగ్‌లో సాగుతోంది. హైదరాబాద్‌ని గంజాయి ఫ్రీ సిటీగా మార్చేందుకు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, తెలంగాణ నార్కోటిక్‌ పోలీసులు చేస్తున్న జాయింట్‌ ఆపరేషన్స్‌ ఎంతవరకు వచ్చాయి? నగరంలో కలుపు మొక్కల్లా పెరిగిపోయిన గంజాయి ముఠాలను ఏరి పారేస్తున్నారా?

Operation Dhulpet : ఫుల్‌స్వింగ్‌లో ఆపరేషన్‌ ధూల్‌పేట్‌.. పారిపోతున్న గంజాయి గ్యాంగ్స్‌
Hyderabad Police On Ganja
Follow us on

ఆపరేషన్‌ ధూల్‌పేట్‌ ఫుల్‌ స్వింగ్‌లో సాగుతోంది. హైదరాబాద్‌ని గంజాయి ఫ్రీ సిటీగా మార్చేందుకు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, తెలంగాణ నార్కోటిక్‌ పోలీసులు చేస్తున్న జాయింట్‌ ఆపరేషన్స్‌ ఎంతవరకు వచ్చాయి? నగరంలో కలుపు మొక్కల్లా పెరిగిపోయిన గంజాయి ముఠాలను ఏరి పారేస్తున్నారా? మరో 10 రోజుల్లో ఆపరేషన్‌ క్లోజ్‌ కానున్న నేపథ్యంలో గంజాయి మాఫియాకు భారీగా చెక్‌ పడింది.

హైదరాబాద్‌ మహానగరాన్ని గంజాయి విముక్త నగరంగా మార్చేందుకు అటు ఎక్సైజ్ ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు ఇటు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా నడుం బిగించారు. వాళ్లు చేపట్టిన ఆపరేషన్‌ ధూల్‌పేట్‌ సత్ఫలితాలు ఇస్తోంది. గంజాయికి అడ్డాగా మారిన ధూల్‌పేట్‌ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చడానికి అధికారులు వరుస దాడులు జరుపుతున్నారు. దీంతో గంజాయి ముఠాలు హడలెత్తిపోతున్నాయి. ఆపరేషన్ ధూల్‌పేట్ ముగియడానికి మరో పది రోజుల టైమ్‌ ఉన్నా…అంతకుముందే అక్కడినుంచి పెట్టెబేడా సర్దుకుని పారిపోతున్నాయి గంజాయి మాఫియా గ్యాంగ్స్‌.

గంజాయి మాఫియా గడ్డ ధూల్‌పేట్‌..!

హైదరాబాద్‌లో గంజాయి మాఫియా గడ్డ ధూల్‌పేట్‌. దాని అడ్డాగానే నగరం అంతటా గంజాయి అమ్మకాలు జరుగుతుంటాయి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్‌మెంట్‌ ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్‌ చేపట్టింది. పోలీసులు.. సీరియస్ యాక్షన్ ప్లాన్‌తో రంగంలోకి దిగడంతో గంజాయి సరఫరాదారులు ధూల్‌పేట్‌ వదిలి పారిపోతున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ధూల్‌పేట్‌కు వెళ్లి మరీ అక్కడ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. అయితే ధూల్‌పేట్‌ కేంద్రంగా స్థానికుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో బయటపడింది.

ఈ నెలాఖరు దాకా ఆపరేషన్‌ ధూల్‌పేట్‌

ఆగస్టు 1న మొదలు పెట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌, ఈ నెలాఖరు దాకా సాగుతుంది. ధూల్‌పేట్‌లో గంజాయి ముఠాల డేటా మొత్తం సేకరించిన తర్వాతే దాడులు మొదలు పెట్టారు అధికారులు. ఇదే క్రమంలో గత 20 రోజుల్లో 29 కేసులు నమోదు చేసి 98.6 కిలోల గంజాయిని సీజ్‌ చేశారు. ఇప్పటివరకు జరిపిన దాడుల్లో 106మంది గంజాయి దందాలో పాల్గొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 63మందిని అరెస్ట్ చేయగా 53మంది పరారీలో ఉన్నారు. వాళ్లను అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. నిత్యం ఇదే దందాలో మునిగి తేలుతున్న 28మందిని బైండోవర్ చేసి, 43మందిపై చార్జిషీట్‌ను ఫైల్ చేశారు అధికారులు.

అజ్ఞాతంలోకి గంజాయి బ్యాచ్‌

ధూల్‌పేట్‌లోని గంజాయి గ్యాంగుల్లో 250మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆపరేషన్‌ ధూల్‌పేట్‌ ప్రారంభం కాగానే…వాళ్లలో సగం మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఎక్సైజ్‌ పోలీసులు చెబుతున్నారు. వీళ్లు తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం ఉండడంతో…ధూల్‌పేట్‌పై నిరంతర నిఘా పెట్టాయి ఎక్సైజ్‌ వర్గాలు. ఈ నెలాఖరు కల్లా ధూల్‌పేట్‌లో గంజాయి దందా ఖేల్‌ ఖతం చేయడానికి పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతున్నారు అధికారులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..