ఇక మా వల్ల కాదు.. ఎన్నికల బహిష్కరిస్తున్నాం.. ఊర్లకు ఊర్లే సంచలన నిర్ణయం
ఈ ఎన్నికల్లో ఏ నాయకుడు తమ గ్రామానికి ఓటు అడిగేందుకు అడుగు పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు. తమ సమస్యలు తీర్చే సత్తా ఉంటే.. వాగులపై వంతెనలు నిర్మించే దమ్ముంటేనే తమ గ్రామానికి రావాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. రాబోయే ఎన్నికలను బహిష్కరిస్తున్నామని.. ఓట్ల కోసం మా గ్రామాల వైపు రావద్దంటూ నాయకులకు వార్నింగ్‌లు ఇస్తున్నారు అక్కడి ప్రజలు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఏ మారుమూల గ్రామం వెళ్లినా ఎన్నికల బహిష్కరణ నినాదాలే వినిపిస్తున్నాయి. గో బ్యాక్ లీడర్స్ అన్న ఫ్లెక్సీలే దర్శనం ఇస్తున్నాయి.

ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారారు.. అయినా తమ సమస్య తీరడం లేదు.. దశాబ్దాలు గడుస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా గ్రామాల బతుకులు ఆగిపోయాయి. నడక దారి లేక వాగులపై ప్రమాదకర ప్రయాణాలు చేస్తూ నరకం అనుభవిస్తున్నారు.. ఇక ఇలాగైతే కుదరదు సర్కార్‌తో తాడో పేడో తేల్చుకోవాల్సిందే అంటూ కఠిన నిర్ణయం తీసుకున్నాయి ఆ గ్రామాలు. రాబోయే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తేల్చి చెప్పేశారు.
ఈ ఎన్నికల్లో ఏ నాయకుడు తమ గ్రామానికి ఓటు అడిగేందుకు అడుగు పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు. తమ సమస్యలు తీర్చే సత్తా ఉంటే.. వాగులపై వంతెనలు నిర్మించే దమ్ముంటేనే తమ గ్రామానికి రావాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. రాబోయే ఎన్నికలను బహిష్కరిస్తున్నామని.. ఓట్ల కోసం మా గ్రామాల వైపు రావద్దంటూ నాయకులకు వార్నింగ్‌లు ఇస్తున్నారు అక్కడి ప్రజలు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఏ మారుమూల గ్రామం వెళ్లినా ఎన్నికల బహిష్కరణ నినాదాలే వినిపిస్తున్నాయి. గో బ్యాక్ లీడర్స్ అన్న ఫ్లెక్సీలే దర్శనం ఇస్తున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ లోని గుండి, గంగాపూర్ గ్రామపంచాయితీల పరిధిలోని 18 గ్రామాలు మూకుమ్మడిగా అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కారణం ఒకటే ఆయా గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు కనీసం రహదారి లేకపోవడం. వాగులపై వంతెనలు నిర్మాణం పూర్తికాకపోవడంతో దశాబ్దాలుగా తెప్పలపై నాటు పడవలపై ప్రమాదకరంగా ప్రయాణాలు సాగించలేక.. న్యాయం కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేసిన ఫలితం రాకపోవడంతో మూకుమ్మడిగా ఓ తీర్మానం చేశారు. ఇక చేసేది లేక రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు.
నిర్మల్ జిల్లా కడెం మండలం గంగపూర్ గ్రామ పంచాయితీలో 12 గ్రామాలున్నాయి. ఈ 12 గ్రామాలు మండల కేంద్రానికి చేరాలంటే కడెం వాగును దాటాల్సిందే. ఈ వాగుపై వంతెన నిర్మాణానికి గతంలోనే టెండర్లు ఖరారైన వంతెన నిర్మాణం ప్రారంభమైన బడ్జెట్ కొరతతో నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో రాకపోకల కష్టాలు తీరుతాయనుకున్న గంగాపూర్ గ్రామపంచాయతీ వాసులకు వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో మళ్లీ అదే కష్టాలు వెంటాడాయి. తాజాగా కడెం వరదలతో కడెం వాగు ఉప్పెనలా మారగా ఆ వాగు దాటలేక మూడు నెలలు ఇండ్లకే పరిమితమై నరకయాతన అనుభవించారు. దీంతో ఈసారి జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేదే లేదంటూ కంకణం కట్టుకున్నారు. తమ గ్రామానికి వాగుపై వంతెన నిర్మాణం పూర్తయ్యాకే తమ ఓటు హక్కును వినియోగించుకుంటామంటూ తేల్చి చెప్పారు. తమ గ్రామంలోకి ఓట్లు అడిగేందుకు ఏ పార్టీ నాయకుడు కూడా రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఒక్క నిర్మల్ జిల్లాలోని గంగాపూర్ గ్రామపంచాయతీలోని 12 గ్రామాల పరిస్థితి మాత్రమే కాదు అటు కొమరం భీం జిల్లాలోని గుండీ గ్రామస్తులవి అవే కష్టాలు.
కొమురం భీం ఆసిపాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా గుండి గ్రామస్తులకు దశాబ్దాలుగా రోడ్డు మార్గం లేదు. కారణం అక్కడ ప్రవహిస్తున్న గుండి వాగే కారణం. ఈ వాగు పై దశాబ్దం క్రితమే వంతెన నిర్మాణానికి అనుమతి వచ్చినా.. అక్కడి పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు ఆ వంతెన పూర్తి కాలేదు. వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో వరద కష్టాల నుండి గట్టెక్కలేక.. వరదలో వాగు దాటలేక పదేళ్లుగా నరకం చూస్తునే ఉన్నారు గుండి వాసులు. దీంతో ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోకూడదని.. ఎన్నికలను బహిష్కరించాలని ఓ నిర్ణయానికి వచ్చారు.
అటు కొమురంభీం జిల్లా గుండిలోని ఆరు గ్రామాల ప్రజలు ఇటు నిర్మల్ జిల్లాలోని గంగాపూర్ పంచాయితీలోని 12 గ్రామాల ప్రజలు ఎన్నికల బహిష్కరణ నిర్ణయంతో ఓటు హక్కుకు దూరం కాబోతున్నారు. గ్రామ పెద్దల నిర్ణయంతో ఇప్పుడు ఆయా గ్రామాలలో ఎక్కడ చూసిన పోల్ బాయ్‌కాట్ నినదాలే వినిపిస్తున్నాయి. ఇక్కడి ప్రజల డిమాండ్ కారణంగా ఈ గ్రామాల్లో ప్రచారం చేపట్టేందుకు అధికార బీఆర్ఎస్ నాయకులు జంకుతున్నారు. ఈ 18 గ్రామాల ప్రజల నిర్ణయంతో బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా గ్రామస్తులంతా గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి మూకుమ్మడిగా నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, అటవీ శాఖ కార్యాలయాలలకు తాళాలు వేసి వాగుఒడ్డు వద్ద ఆందోళనకు దిగారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయినా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, వాగుపై వంతెన నిర్మాణం జరుగుతుందని ఆశించినా నిరాశే మిగిలింది. ఇక్కడి నాయకులను నమ్మి గెలిపించుకున్నామని.. అయినా ఆ నేతలు ఎన్నికలు ముగిసాక తమ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. కొమురంభీం జిల్లా గుండి గ్రామస్తులతో పాటు నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ పంచాయతీతో పాటు కొత్తగా ఏర్పాటైన రాణిగూడ, కొర్రతాండ పంచాయతీలకు అనుబంధంగా ఉన్న మరో తొమ్మిది గ్రామాలు సైతం ఎన్నికల బహిష్కరణ నిర్ణయానికి వచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
