Telangana: పెద్ద చదువులు లేవు, డిగ్రీ పట్టాలు లేవు.. కానీ అతని ఇన్నోవేషన్‌ చూస్తే మతిపోవాల్సిందే!

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. ఇష్టంతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చు.. అన్న నానుడిని నిజం చేశాడో ఓ యువకుడు. ఉన్నత చదువులు లేకపోయినా కొత్త ఆవిష్కరణలకు అడ్డంకి కాదని నిరూపించాడు. తన సృజనాత్మకతతో ఓ బైక్ ను తయారు చేశాడు. ఆ బైక్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: పెద్ద చదువులు లేవు, డిగ్రీ పట్టాలు లేవు.. కానీ అతని ఇన్నోవేషన్‌ చూస్తే మతిపోవాల్సిందే!
Tg News

Edited By:

Updated on: Nov 09, 2025 | 4:25 PM

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన బానోతు సక్రూ, కమిలి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వీరిది. మేకలను కాస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. బానాతు సక్రూ, కమిలి దంపతుల కొడుకు సిపాయి స్థానికంగా పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి బాలేక ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేశాడు. ఇంటి వద్ద తండ్రికి సహాయంగా మేకల కాపరిగా ఉంటున్నాడు. నిత్యం ఎలక్ట్రికల్ వస్తువులతో ఏదో తయారు చేస్తూ ఉండేవాడు. తనకున్న బైక్ తో వ్యవసాయ పనులతో పాటు హుజూర్ నగర్ కు వెళ్లి వస్తుండేవాడు.

అయితే తరచూ ప్రయాణం కారణంగా బైక్ నిర్వహణ వ్యయం భారంగా మారాయి. దీంతో ఇంటికి సోలార్ విద్యుత్తు అమర్చుకున్నట్టే బైక్ కు కూడా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించాడు. సెకండ్ హ్యాండ్ ఈవీ బైక్ ను కొనుగోలు చేసిన బానోతు సిపాయి.. దాని ముందు భాగంలో సోలార్ ప్యానల్ ఏర్పాటు చేశాడు. సోలార్ ప్యానల్ నుండి ఆటో ఛార్జింగ్ ద్వారా బైక్ బ్యాటరీ ఛార్జ్ అయ్యేలా అమర్చాడు. సోలార్ విద్యుత్తుతో బైక్ ను విజయవంతంగా నడిపాడు.

ఒకసారి సోలార్‌తో బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటే 70 కిలోమీటర్ల వరకు తిరగవచ్చని బానోతు సిపాయి తెలిపాడు. గతంలోనూ స్థానికంగా పలు ఆవిష్కరణలు చేసిన సిపాయి ప్రముఖుల మన్ననలు పొందారు. ప్రభుత్వం తనకు ప్రోత్సాహమిస్తే రైతులకు ఉపయోగపడే ఎన్నో ఎలక్ట్రికల్ ఆవిష్కరణలు, వస్తువులను తయారు చేస్తానని సిపాయి చెబుతున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us