Telangana: పండుగను మింగేసిన ఆధిపత్య పోరు.. 46 ఏళ్లుగా దసరాకు దూరమైన గ్రామం..
దసరా పండుగ అంటేనే విజయాలు, ఆత్మీయ ఆలింగనాలకు ప్రతీక.. పాత పగలను పక్కనపెట్టి.. కొత్త బంధాలకు స్వాగతం పలికే అపురూప వేడుక. కానీ.. ఇక్కడో గ్రామానికి మాత్రం దసరా అంటే సంబురం కాదు.. సంతోషం కాదు. వాళ్లకు దసరా అంటే ఓ రనరంగానికి వేదిక.. 46 ఏళ్లుగా ఆ గ్రామస్తులకు దసరా పండుగ దూరమైంది.. అదెందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామం ఒకప్పుడు.. కుల మతాలకు అతీతంగా ఉండేది. వ్యవసాయ ఆధారిత గ్రామమైనప్పటికీ.. రాజకీయ చైతన్యానికి మారుపేరు. గ్రామంలో వామపక్ష పార్టీలకు బలమైన పట్టు ఉండేది. ముఖ్యంగా సీపీఎం, సీపీఐ(ఎంఎల్) పార్టీల మధ్య రాజకీయ పోటీ గ్రామంలో వర్గ విభేదాలకు కారణమైంది. వరుస ఎన్నికల్లో ఆధిపత్యం కొనసాగించిన సీపీఎంకు.. 1980వ దశకంలో జరిగిన ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. సీపీఎం తరఫున పోటీ చేసిన తొట్ల మల్సూరు ఓటమి చెందగా.. సీపీఐ(ఎంఎల్) తరఫున బరిలో నిలిచిన బాణాల చంద్రారెడ్డి విజయం సాధించడంతో రాజకీయ ఆధిపత్య పోరు ఎక్కువైంది.
కంకణం చుట్టూ మొదలైన కక్షలు..
గ్రామ సర్పంచ్ గా సిపిఐ (ఎంఎల్) కు చంద్రారెడ్డి ఎన్నికైన సంవత్సరంలో దసరా పండుగ వచ్చింది. పండుగ రోజున సర్పంచ్‌కు కంకణాలు కట్టే సంప్రదాయం వివాదానికి దారితీసింది. సంప్రదాయం చుట్టూ మొదలైన మాటల యుద్ధం.. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పండుగను కలిసి కట్టుగా జరుపుకోవాల్సిన వేళ.. అదే పండుగ వివాదానికి వేదికైంది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు దాడులు చేసుకోవడంతో కొందరు గాయపడ్డారు. ఆధిపత్య ధోరణులు సామాజిక సంబంధాలపైనా ప్రభావం చూపాయి.
శాంతి కోసం ఆగిన పండుగ..
గ్రామంలో రెండు పార్టీల మధ్య రాజకీయ విభేదాలు, ఘర్షణలు ఎక్కువయ్యాయి. దీంతో గ్రామ పెద్దలు పోలీసులు.. కలిసి గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో దసరా వేడుకలను నిలిపివేయాలని నిర్ణయించారు. ఘర్షణలను నివారించేందుకు తీసుకున్న చర్య.. కాల క్రమంలో శాశ్వత సంప్రదాయంగా మారిపోయింది. దీంతో దశాబ్దాలుగా చిల్పకుంట్ల గ్రామానికి దసరా పండుగ జరుపుకోకుండా పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
తరాలు మారినా… ప్రారంభం కాని దసరా పండుగ..
నాలుగు దశాబ్దాల క్రితం గ్రామంలో జరిగిన ఘర్షణలను నివారించేందుకు.. దసరా వేడుకలను నిలిపివేశారు. అప్పట్లో పోలీసు బలగాలు పరిమితంగా ఉండేవి. ఆ తర్వాత కాలం మారింది. పోలీసు వ్యవస్థ విస్తరించింది. ఆధునిక సాంకేతిక పద్ధతులను పోలీసులు ప్రస్తుతం వినియోగిస్తున్నారు. గ్రామీణ సమాజంలోనూ అనేక మార్పులు వచ్చాయి. పాత వివాదాలతో ప్రత్యక్ష సంబంధం లేని కొత్త తరం పెరిగి పెద్దదైంది. కానీ చిల్పకుంట్ల గ్రామం మాత్రం దసరా వేడుకలకు మాత్రం దూరమైంది.
భావి తరాలకు అందాల్సిన సంస్కృతి.. జ్ఞాపకాలకే పరిమితం
పండుగలు అంటే కేవలం ఆచారాలు కాదు. అవి సమాజాన్ని కలిపే వారధులు. దసరా పండుగ రోజున జమ్మి పూజలోని ఆధ్యాత్మికతతో పాటు.. జమ్మి ఆకులను బంగారంగా భావించి పంచుకోవడంలో ఆత్మీయత ఉంది. పెద్దలను గౌరవించడం.. పాత మనస్పర్థలను పక్కనపెట్టడం.. పండుగలోని అసలైన సందేశం. కానీ ఆ గ్రామస్తులకు పండుగ సంస్కృతి సాంప్రదాయాలు జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. ఇలాంటి సందేశం, సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు పండుగల ద్వారా అందించాల్సిన అవసరం ఉంది.
46 ఏళ్ల మౌనానికి ముగింపు ఎపుడు..?
దసరా వస్తుంది.. వెళ్తుంది..! కాలం ముందుకు సాగుతుంది..! తరాలు మారుతాయి. కానీ చిల్పకుంటలో మాత్రం 46 ఏళ్లుగా నిలిచిపోయిన పండుగ సంప్రదాయం.. గ్రామ ఐక్యతకు ఒక ప్రశ్నగా మిగిలింది. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలి. వ్యక్తిగత విభేదాలు వ్యక్తుల మధ్యే ఉండాలి. కానీ.. వాటి ప్రభావం తరతరాల సంస్కృతిపై పడితే.. నష్టపోయేది ఒక వర్గం కాదు.. యావత్ గ్రామమే.
అయినా.. దసరా వేడుకలను తిరిగి ప్రారంభించేందుకు చొరవ కనిపించడం లేదన్నది గ్రామస్తుల ఆవేదన చెందుతున్నారు. శాంతిభద్రతలను కాపాడుతూనే సంప్రదాయాన్ని పునరుద్ధరించేచర్యలు చేపట్టాలని యువత కోరుకుంటుంది. కుల మతాలకు అతీతంగా సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందించాల్సిన గ్రామ పెద్దలు ప్రజలను కలిపే దసరా వేడుకలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
