
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోని ఓ రైతు తన గేదేలను ఎండ తీవ్రత నుండి కాపాడుకునేందుకు ఇదిగో ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గేదేకు ఎండ తగలకుండా.. వేసవి తాపం నుండి రక్షణగా పశువులకొట్టంలో ఒక ఫ్యాన్ ఏర్పాటు చేశాడు. అది కూడా సరిపోదేమోనని గేదేపై చల్లటి తట్టు సంచులు కప్పి దానిపై గంట గంటకు చల్ల చల్లని నీళ్లను చల్లుతూ పశువులను కూల్ కూల్ గా ఉంచుకుంటున్నాడు. ఈ ఒక్క రైతే కాదు ఆ మండలంలో చాలా మంది రైతులు పాటిస్తున్న సూత్రం ఇదే. ఇలా చేస్తేనే గేదే పాల దిగుబడి తగ్గదని రైతులు అంటున్నారు. లేదంటే గేదేలు వడదెబ్బకు అస్వస్థకు గురై అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందంటున్నారు.
ఈ వేసవి కాలంలో ఎండ వేడి నుండి పశువులకు ఉపశమనం కలిగించేందుకు రైతులకు అధికారులు కొన్ని సూచనలు చేశారు. రోజురోజుకూ ఎండలు ముదురుతున్న నేపథ్యంలో పాడి పశువులు వడదెబ్బకు గురై పాల దిగుబడి తగ్గే అవకాశముంటుందని.. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 వరకు నీడపట్టున ఉంచాలని.. సాయంత్రం కాగానే వాటిని నీటితో కడగాలని చెపుతున్నారు.
వేసవిలో పశువులు మేత తినకపోవడం, నీరు తాగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బకు గురైనట్లుగా బావించాలని. వాటికి బెల్లం, ఉప్పు, కలిపిన ద్రావణం తాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎండలో పశువులను అసలు వదిలేయ వద్దని. వేసవిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పశువులను అసలు మేతకు బయటకు వదలకూడదని చెపుతున్నారు. భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో గేదేలు, పశువుల శరీరం హీటెక్కకుండా తాగేందుకు చల్లని నీరు పాకాలో అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు.
రోజుకు 3 లేదా 4 సార్లు చల్లని నీటితో పశువులను కడగాలని.. లేదా చెరువులలో పశువులను వదలాలని చెబుతున్నారు. పశువులకు నిత్యం నాలుగు నుంచి ఐదుసార్లు తాగునీరు అందించాలి. చల్లదనం కోసం గోనె సంచులను నీటిలో ముంచి షెడ్ చుట్టూ కట్టాలని చెబుతున్నారు. షెడ్ పై గోనె సంచులు, గడ్డి ఉంచి వాటిపై నిత్యం నీళ్లు చల్లుతూ ఉండాలని సూచిస్తున్నారు. గేదెల శరీరం నల్లగా ఉండటంతో అధిక ఉష్ణోగ్రతకు అవి తట్టుకోలేవని.. వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు పశువుల మెదడులో హైపోథలామస్ అనే భాగం స్వేద గ్రంథులు చెమటను అధికంగా ఉత్పత్తి చేస్తాయంటున్నారు.
చెమట ద్వారా శరీరంలోని ధాతువులు కోల్పోయి.. జీవక్రియ దెబ్బ తింటుందని చెపుతున్నారు పశు వైద్యులు. పశువుల శరీర ఉష్ణోగ్రత పెరిగి శ్వాస, గుండె, నాడి, మూత్ర పిండాల విధులు తగ్గిపోయి పశువుల ఆరోగ్యం విషమంగా మారుతుందని చెపుతున్నారు. గేదేలు, ఆవులు ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై శ్వాస సరిగా అందక మరణించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
పశువులలో శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల సెల్సియస్ మించితే చర్మం మృధుత్వం తగ్గిపోయి, గట్టి పడుతుందని.. నోటితో గాలి పీల్చుకోవడం, నోటి వెంకట చొంగ కారడం జరుగుతుందని, ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు పక్షవాతం, లక్షణాలు సంభవించి క్రమంగా కోమాలోకి వెళ్లి పశువు మరణిస్తుందని చెపుతున్నారు. కాబట్టి వేసవిలో పవుశులను కాపాడుకునేందుక రైతులు పైన పేర్కొన్న జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.