Telangana Lands Value: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలను (Lands Value) సవరిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు 50 శాతం, ఖాళీ స్థలాలవి 35 శాతం, అపార్ట్‌మెంట్‌ల ఫ్లాట్ల విలువను 25-30 శాతం పెంచుతూ (Telangana) రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం సుదీర్ఘ సమీక్ష అనంతరం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ప్రతిపాదనలను జిల్లా రిజిస్ట్రార్లకు పంపింది. అనంతరం రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్ర, శనివారాల్లో ప్రతిపాదనలను ఆమోదించి పంపించేలా చర్యలు తీసుకోవాలని అన్ని రిజిస్ట్రార్లను ఆదేశించారు.
పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో మార్కెట్ విలువల కమిటీకి అదనపు కలెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవోలు చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. కమిటీలో సభ్యులుగా ఉండే అధికారులందరూ ఒకే చోట సమావేశమై ప్రక్రియ ముగించాలని కమిషనర్ సూచించారు. సవరించిన మార్కెట్ విలువలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం కలెక్టర్లకు సమాచారం ఇచ్చింది. కాగా.. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ విలువలకు, ప్రతిపాదించిన విలువల మధ్య సరాసరి వ్యత్యాసం 35-40 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అయితే.. వాణిజ్య సముదాయాల్లో అన్ని ఫ్లోర్‌లకు ఒకే మార్కెట్ విలువను నిర్ణయించారు. స్థలాల విలువల సగటు 35 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. తక్కువ విలువ ఉన్న ప్రాంతాల్లో 50 శాతం, అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుకు 25-30 శాతం దాకా పెంచారు. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 శాతం పెరిగింది.
రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్
ఒకటో తేదీ నుంచి ఆస్తుల మార్కెట్ విలువలు పెరగనున్న నేపథ్యంలో పాత ధరల్లో గురువారం రిజిస్ట్రేషన్లు భారీగా జరిగాయి. హైదరాబాద్ చుట్టుపక్కల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు జిల్లా కేంద్రాల్లోని కార్యాలయాలు కిటకిటలాడాయి. సాధారణంగా రోజుకు 40-50 రిజిస్ట్రేషన్లు జరిగే చోట 120 నుంచి 150 జరిగాయి. దీంతో అర్ధరాత్రి వరకు కార్యాలయాలను నడిపించారని సమాచారం.
Also Read: