Cadaver Dogs: NDRF టీమ్‌లోకి కెడావర్‌ డాగ్స్‌… ఏమిటీ వీటి స్పెషాలిటీ?

విపత్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే NDRF మరింత అప్‌డేట్‌ అవుతోంది. ప్రమాదాల సమయంలో రెస్క్యూ ఆపరేషన్లను స్పీడప్‌ చేసే క్రమంలో మృతదేహాలను గుర్తించేందుకు కొత్తగా కెడావర్‌ డాగ్స్‌ను రంగంలోకి దించబోతోంది. రెస్క్యూ ఆపరేషన్‌ల సమయంలో మానవ మృతదేహాలు, అవశేషాల ఆచూకీని పసిగట్టేందుకు NDRF తొలిసారి...

Cadaver Dogs:  NDRF టీమ్‌లోకి కెడావర్‌ డాగ్స్‌... ఏమిటీ వీటి స్పెషాలిటీ?
Cadavar Dogs

Updated on: Jul 21, 2025 | 8:06 AM

విపత్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే NDRF మరింత అప్‌డేట్‌ అవుతోంది. ప్రమాదాల సమయంలో రెస్క్యూ ఆపరేషన్లను స్పీడప్‌ చేసే క్రమంలో మృతదేహాలను గుర్తించేందుకు కొత్తగా కెడావర్‌ డాగ్స్‌ను రంగంలోకి దించబోతోంది. రెస్క్యూ ఆపరేషన్‌ల సమయంలో మానవ మృతదేహాలు, అవశేషాల ఆచూకీని పసిగట్టేందుకు NDRF తొలిసారి జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని NDRF బెటాలియన్లలో కొన్ని నెలల క్రితం ఆరు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ప్రారంభించింది. కెడావర్‌ డాగ్స్‌గా పిలిచే బెల్జియన్ మాలినోయిస్, లాబ్రడార్ జాతులకు చెందిన జాగిలాలకు ట్రైనింగ్‌ ఇస్తోంది. దీనికోసం మృతదేహాల నుంచి వచ్చే వాసనను పోలి ఉండే ప్రత్యేక సెంట్‌ను విదేశాల నుంచి తీసుకొచ్చారు NDRF అధికారులు.

ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనాస్థలాల్లోని వాతావరణ పరిస్థితులు, మంచు, ఇతర వాసనలు లాంటివి జాగిలాల పనితీరుపై ప్రభావం చూపుతుండడంతో పూర్తిస్థాయిలో మృతదేహాలను గుర్తించలేకపోతున్నాయి. జాగిలాలకు ఇలాంటి ట్రైనింగ్‌ ఇవ్వడం కూడా NDRFకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే.. మానవ మృతదేహాలు, శరీరభాగాల లభ్యత అంత ఈజీ కాకపోవడంతో విదేశాల నుంచి ప్రత్యేక సెంట్‌ తీసుకొచ్చినట్లు వెల్లడించారు NDRF అధికారులు. ట్రైనింగ్‌ పూర్తవుతున్న నేపథ్యంలో త్వరలోనే ఫస్ట్‌ బ్యాచ్‌ కెడావర్‌ డాగ్స్‌ను విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన NDRF బెటాలియన్లలో కెడావర్‌ డాగ్స్‌ను అందుబాటులో ఉంచుతామని.. క్షేత్రస్థాయిలో రంగంలోకి దించిన తర్వాత వీటి సక్సెస్‌ రేటు తెలుస్తుందన్నారు.

ఇక.. ఇటీవల SLBC టన్నెల్‌ ప్రమాదంలో కార్మికులు చిక్కుకుపోగా వారిని గుర్తించేందుకు కేరళ పోలీసు విభాగానికి చెందిన రెండు జాగిలాలతో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు NDRF అధికారులు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడినప్పుడు కూడా సహాయక చర్యల్లో వీటినే ఉపయోగించారు. మొత్తంగా.. ప్రమాదాల సమయంలో మృతదేహాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా NDRF టీముల్లోకి కెడావర్‌ డాగ్స్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.