Nallgonda Road accident: గూటికి వెళ్లకుండానే మృత్యు ఒడిలోకి.. కూలీలను పొట్టపెట్టుకున్న రోడ్డు ప్రమాదం

|

Jan 22, 2021 | 3:39 PM

Nallgonda Road accident: రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రయాణికుల పాలిట మృత్యుదారులుగా మారుతున్నాయి. అయితే మానవ తప్పిదమే మనకు భద్రత లేకుండా చేస్తోంది...

Nallgonda Road accident: గూటికి వెళ్లకుండానే మృత్యు ఒడిలోకి.. కూలీలను పొట్టపెట్టుకున్న రోడ్డు ప్రమాదం
Follow us on

Nallgonda Road accident: రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రయాణికుల పాలిట మృత్యుదారులుగా మారుతున్నాయి. అయితే మానవ తప్పిదమే మనకు భద్రత లేకుండా చేస్తోంది. ఎటు నుంచి ఏ వాహణం వచ్చి ఢీకొని ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదాలకు రహదారుల నిర్మాణం ఒక కారణమైతే నిబంధనలు పాటించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం ఇతర కారణాలుగా చెప్పవచ్చు. ప్రతి నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. రహదారులు రక్తసిక్తంగా మారుతున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతను పాటిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది కూలీల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చాలా మంది వరకు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

వాళ్లంతా నిరుపేద కూలీలు.. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు. రోజు కూలి చేయనిదే పూట గడవని పరిస్థితి. అలాంటి కూలీలను రోడ్డు ప్రమాదంలో మృత్యువు వెంటాడింది. వరినాటు వేసేందుకు కూలి పనులు దొరకడంతో సంతోషంగా అందరు కలిసి ఒకే ఆటోలో దాదాపు 30 కిలోమీటర్ల దూరం బయలుదేరారు. అయితే సాయంత్రం వరకు నాటు వేసి అలసిపోయిన వారంతా ఇంటి దారి పట్టారు. ఆటో డ్రైవర్‌ సహా 21 మంది కిక్కిరిసి కూర్చున్నారు. ఆటోలో ప్రయాణిస్తూ అందరూ ముచ్చట్లలో మునిగిపోయారు. అంతలోనే ఒక్కసారిగా ఆటో కుడివైపునకు దూసుకెళ్లింది. కళ్లు మూసి తెరిచేలోగా  ఏం జరిగిందో తెలియని పరిస్థితి. బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. అంతా తేరుకునేలోగా బొలెరో వాహనం పక్క నుంచి వస్తున్న వాహనం పక్క నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. వీరంతా చింతబాయి గ్రామానికి చెందిన వారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో పీఏపల్లి మండలం అంగడిపేట ఎక్స్‌ రోడ్డు సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో చింతబాయి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన విషయం తెలిగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

అయితే దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 21 మంది కూలీలు పీఏపల్లి మండలం రంగారెడ్డిగూడెం గ్రామానికి వరినాట్లు వేసేందుకు ఆటోలో వెళ్లారు. పని ముగించుని తిరిగి ఆటోలో హైదరాబాద్‌ – నాగార్జున సాగర్‌ రహదారిపై వస్తున్నారు. అంగడిపేట ఎక్స్‌ రోడ్డు సమీపంలో ఎస్‌ఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్దకు రాగానే ఆటో ఒక్కసారిగా కుడివైపు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. వెంటనే బొలోరో పక్కన వస్తున్న లారీ, ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనా స్థంలో ఆరుగురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. మొత్తం 9 మందిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. మరి కొందరు ఆస్పత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. అయితే గ్రామం ఇంకా 25 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులు

కొట్టం చంద్రకళ(37), నోముల సైదమ్మ(45), కొట్టం మల్లేశం40), కొట్టం పెద్దమ్మ(55), గొడుగు, గమ్మ(48), నోముల అంజమ్మ(48), నోముల పెద్దమ్మ(50), అలివేలు(35), గొడుగు ఇద్దమ్మ(57) ఉన్నారు. అలాగే తీవ్ర గాయాలతో నోముల వెంకటమ్మ, అంజమ్మ, రామానుజ, యాదమ్మ, నర్సమ్మ, అంజమ్మ, యాదమ్మ లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్‌ మల్లేశం, అతడి తల్లి పెద్దమ్మ, భార్య చంద్రకళ ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి కాగా, ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ మల్లేశంతో పాటు అతడి తల్లి పెద్దమ్మ, భార్య చంద్రకళ ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా డ్రైవర్‌ మల్లేశం, చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. తల్లి, దండ్రి, నాన్నమ్మ మృతితో ఆ చిన్నారులు అనాథలుగా మారారు.