రంగునీటిలో ముంచి నగదు మాయం చేసిన కేటుగాళ్లు.. కంగుతిన్న పోలీసులు..

| Edited By: Srikar T

Jun 25, 2024 | 6:01 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమాలో బంగారాన్ని నదిలో వేస్తే రెట్టింపు అవుతుందని మోసం చేసిన సీన్ తరహాలోనే అమాయకులను బురిడీ కొట్టించింది ఓ ముఠా. కాకపోతే ఆ సీన్‎లో బంగారం బదులు.. నగదును ఉంచి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ కేటుగాళ్లు చేసిన మోసాన్ని చూసి పోలీసులే షాక్ తిన్నారు.

రంగునీటిలో ముంచి నగదు మాయం చేసిన కేటుగాళ్లు.. కంగుతిన్న పోలీసులు..
Nalgonda
Follow us on

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమాలో బంగారాన్ని నదిలో వేస్తే రెట్టింపు అవుతుందని మోసం చేసిన సీన్ తరహాలోనే అమాయకులను బురిడీ కొట్టించింది ఓ ముఠా. కాకపోతే ఆ సీన్‎లో బంగారం బదులు.. నగదును ఉంచి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ కేటుగాళ్లు చేసిన మోసాన్ని చూసి పోలీసులే షాక్ తిన్నారు. డబ్బులు రెట్టింపు చేస్తామంటూ బురిడి కొట్టించిన ముఠాను పోలీసులు కటకటాలపాలు చేశారు.

బీహార్‎కు చెందిన రామ్ నరేష్ యాదవ్.. తాపీ మేస్త్రిగా నల్లగొండ మండలం చందనపల్లిలో పనిచేశాడు. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ రామాచారి ఇంటికి కూడా తాపీ మేస్త్రిగా పనిచేయడంతో ఇద్దరు మధ్య పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం రామ్ నరేష్ యాదవ్ బీహార్‎కు చెందిన అతని ఫ్రెండ్స్ షేక్ సిరాజ్, షేక్ అఫ్తాబ్‎లు ఆర్ఎంపీ డాక్టర్ రామాచారి ఇంటికి వెళ్లారు. డబ్బులను రెట్టింపు చేసే లిక్విడ్ ఉందని చెప్పారు. మీ దగ్గర ఉండే డబ్బును రెట్టింపు చేసి ఇస్తామని ఆశ చూపించారు. వారి మాటలను నమ్మిన రామాచారి అతని బావమరిది భూమి కొనుగోలు చేసేందుకు తెచ్చిన రూ.33 లక్షల నగదును తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్‎లో వారికి ఇచ్చారు.

లిక్విడ్‎తో నగదు మాయం..

కేటుగాళ్లు తమ వెంట తెచ్చుకున్న లిక్విడ్‎ను బకెట్లో పోసి రూ. 33 లక్షలను అందులో ముంచి బయటకు తీసి బ్రౌన్ టేప్‎తో బండిల్స్‎గా కట్టారు. గంట తర్వాత వాటిని స్టవ్‎పై వేడిచేసి ఒక రోజు తర్వాత ఓపెన్ చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించారు. లిక్విడ్‎లో ముంచి తీసిన బండిల్స్‎కు హైదరాబాద్‎కు వెళ్లి లేబుల్స్ కొనుక్కొస్తామని కేటుగాళ్లు చెప్పారు. ఇంతలోనే అమరేంద్ర చారి తన ఇంటికి వెళ్ళగా, పేషెంట్ వచ్చాడని రామాచారి మొదటి ఫ్లోర్ నుండి కిందికి దిగాడు. ఇదే అదునుగా దుండగులు తమ ప్లాన్‎ను ఆచరణలో పెట్టారు. అప్పటికే రామ్ నరేష్ యాదవ్, సిరాజ్‎లు తమవద్ద ఉన్న బ్యాగులో కింద ఒకటి.. పైనఒకటి ఒరిజినల్ రూ.500 నోట్లు పెట్టి.. మధ్యలో తెల్లటి కాగితాలతో ప్యాక్ చేసి ఉంచిన డబ్బు కట్టలను తెచ్చుకున్నారు. వీటిని అసలైన కరెన్సీ నోట్ల స్థానంలో ఉంచి వాటిని ఆ ముఠా తమ బ్యాగులో వేసుకున్నారు. హైదరాబాద్‎కు వెళ్లి లేబుల్స్ తీసుకుని ఉదయం వస్తామని చెప్పి కేటుగాళ్లు పరారయ్యారు.

మరుసటి రోజు జాదూగాళ్లు రాకపోవడంతో నకిలీ కరెన్సీ బండిల్స్‎ను ఓపెన్ చేసిన రామాచారి, తన బావమరిది అమరేంద్ర చారిలు అవాక్కయ్యారు. మోసపోయామని గ్రహించిన రామాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్‎గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నల్గొండ రైల్వే స్టేషన్‎లో బిహార్‎కు పారిపోయేందుకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరి బ్యాగ్‎లను చెక్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారించగా ఘరానా మోసం బయటపడిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. నిందితుల నుంచి రూ.24 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు, కలర్ సీసాలు, తెల్ల కాగితాల పేపర్ కట్టలను స్వాగతం చేసుకున్నామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు. ఇలాంటి ఘరానా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి కేటుగాళ్లు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..