
దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన జాతర నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో కొలువైన నాగోబా ఆలయంలో ఈ ఏడాది జాతరకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. నేడు మర్రి చెట్టు వద్ద ఉంచిన పవిత్ర గంగాజలాన్ని ప్రధాన ఆలయానికి సంప్రదాయ బద్దంగా తరలించారు. ఆడబిడ్డలు కొత్త కుండల్లో మర్రి చెట్టు వద్ద ఉన్న పురాతన బావిలో నుండి మంచి నీటిని తీసుకు రాగా.. మెస్రం వంశ అల్లుల్లు కొత్త పుట్టను తయారు చేశారు. అర్థరాత్రి గంగా జలాభిషేకంతో అసలు సిసలు ఘట్టం ప్రారంభం కానుంది. ఈ నెల 18 నుండి 25 వరకు జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. 22న గిరిజన దర్బార్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రానున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు.
రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతరకు.. మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లాలోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన పవిత్ర గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, ఏడు రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర అంకురార్పణ జరుగుతుంది. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ , ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. జాతరలో భాగంగా మెస్రం వంశీయులు, ఆలయ శుద్ధి నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో ఇతరులకు ఆలయంలోకి ప్రవేశం ఉండదు. పురుషులు మాత్రమే పాల్గొనే పెర్సపేన్ పూజలతో పాటు మహిళలు విశేషంగా పాల్గొనే భాన్ దేవత పూజలు ఈనెల 20 న జరుగుతాయి. 22న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించి గిరిజనులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం 23న భేతల్ పూజలు, మండ గాజిలింగ్ కార్యక్రమాలతో మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు ముగుస్తాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 25 వరకు జాతర కొనసాగనుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..