
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లిలో బాయిలర్ కోళ్లు వేలసంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. రెండు ఫౌల్ట్రీ ఫామ్స్‌లో అంతుచిక్కని వైరస్‌తో పెద్దఎత్తున చనిపోతున్నాయి. గత మూడ్రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మరణించాయని వాపోతున్నారు ఫౌల్ట్రీ రైతులు. ఇప్పటివరకు 10 వేల కోళ్లు మృత్యువాత పడినట్లు పేర్కొంటున్నారు. అయితే ఎందుకు చనిపోతున్నాయో తెలియడం లేదంటున్నారు. రోజురోజుకీ ఈ సంఖ్య పెరుగుతోందని, దీని గురించి అధికారులు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. అంతుచిక్కని వైరస్‌తో తెలంగాణ వ్యాప్తంగా లక్షల కోళ్లు చనిపోయినట్టు ఫౌల్ట్రీ రైతులు అంటున్నారు. కోళ్ల శాంపిల్స్‌ను తీసి ల్యాబ్స్‌కి పంపించారు. కోళ్ల మృతితో భారీగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.
కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం చిన్నపురావుపల్లిలో ఉన్న ఓ ఫారంలో 5 వేల కోళ్లు చనిపోగా.. నాగర్‌కర్నూల్ మండలంలోని రాంరెడ్డిపల్లి తండాలో 1,500 కోళ్లు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మరో 4 వేల వరకు కోళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కోళ్ల మృతికి కారణమైన వైరస్‌ను గుర్తించేందుకు శాంపిళ్లను సేకరించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా కోళ్ల నమూనాలను సేకరించి, వైరస్ రకాన్ని నిర్ధారించేందుకు పూర్తిస్థాయిలో పరిశోధనలు జరపనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..