హైదరాబాద్‌లో బుధవారం ఉదయం జనాలను కలవరానికి గురి చేసిన వింత వస్తువు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లో ప్రత్యక్షమయ్యింది. ఆదిత్య 369 సినిమాలో మాదిరిగా ఉన్న ఈ గుండ్రని భారీ శకటం.. వ్యవసాయ భూముల్లో కుప్పకూలింది. ఎక్కడి నుంచో వచ్చి పంట పొలాల్లో పడిపోయింది. ఆ వింత శకటాన్ని చూసి జనాలు తొలుత హడలిపోయారు. ఆ తరువాత కాస్త ధైర్యం చేసి వింతగా చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చి పడిందోనని, ఇది ఏంటోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వింత వస్తువుపై అధికారులకు సమాచారం అందించారు గ్రామస్తులు. విషయం తెలుసుకున్న మర్పల్లి తహసీల్దార, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వింత వస్తువును పరిశీలిస్తున్నారు.
ఇదిలాఉంటే.. బుధవారం ఉదయం హైదరాబాద్ ప్రాంతంలో ఈ వింత వస్తువు ఆకాశంలో సంచరించి జనాలను హడలెత్తించింది. ఆ వింత ఆకారాన్ని చూసి జనాలు అంతా ఏలియన్స్ వచ్చాయని జడుసుకున్నారు. కొందరైతే ఏదైనా గ్రహం కావొచ్చునని, మరికొందరు నక్షత్రం కావొచ్చునని భావించారు. ఈ వింత ఆకారాన్ని తమ ఫోన్ కెమెరాలలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది.
క్షణాల్లోనే ఆ వింతవుకు సంబంధించిన వార్త వైరల్ అవడంతో సైంటిస్టులు స్పందించారు. ఈ వింత వస్తువుపై క్లారిటీ ఇచ్చారు. అది ఒక బెలూన్ అని ప్రకటించారు. వాతావరణాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే భారీ హీలియం బెలూన్ అని స్పష్టం చేశారు సైంటిస్టులు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అయితే, హైదరాబాద్‌లో ఆకాశంలో కనిపించిన వింత ఆకారం.. వికారాబాద్‌లో కుప్ప కూలిన శకటం ఒకటేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంత శకటం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఇక్కడ ఎందుకు కూలిపోయింది? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం హైదరాబాద్‌లో కనిపించిన వింత ఆకారం, వికారాబాద్‌లో కూలిన శకటం రెండూ ఒకటేనని భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..