Munugode Bypoll: నువ్వా నేనా అన్నట్లుగా మునుగోడు వార్.. మంత్రి షాకింగ్ ఆరోపణలు.. కొట్టిపారేస్తున్న మాజీ ఎమ్మెల్యే..

|

Oct 02, 2022 | 8:27 PM

మునుగోడు ఎన్నికల వార్ నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. బీజేపీ అభ్యర్ధి ఈ ఎన్నికను ఏకంగా తెలంగాణ భవితను మార్చేదిగా చెబుతున్నారు.

Munugode Bypoll: నువ్వా నేనా అన్నట్లుగా మునుగోడు వార్.. మంత్రి షాకింగ్ ఆరోపణలు.. కొట్టిపారేస్తున్న మాజీ ఎమ్మెల్యే..
Munugode Bypoll
Follow us on

మునుగోడు ఎన్నికల వార్ నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. బీజేపీ అభ్యర్ధి ఈ ఎన్నికను ఏకంగా తెలంగాణ భవితను మార్చేదిగా చెబుతున్నారు. తనపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా.. మునుగోడు ప్రజలు నమ్మరనీ అన్నారు. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాలు కాషాయ కండువా కప్పుకుంటున్నాయనీ.. కేసీఆర్ అడుగడుగునా ఉద్యమకారులను అవమాన పరుస్తున్నారనీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక సంక్షోభంలో ఉందని.. ఆందోళన వ్యక్తం చేశారు రాజగోపాలరెడ్డి.

ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేస్తుంటే.. అటు మంత్రి జగదీశ్ రెడ్డి ఇందుకు భిన్నంగా స్పందించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరముందని అంటున్నారు. నేషనల్ పాలిటిక్స్‌లో కేసీఆర్ తప్పక రాణిస్తారనీ.. దేశ ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారని అంటున్నారు జగదీశ్ రెడ్డి. సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలుస్తోందని, రోల్ మోడల్ తెలంగాణ పథకాలను దేశ వ్యాప్తంగా జనం డిమాండ్ చేస్తున్నారని, నేషనల్ పాలిటిక్స్ లో కేవలం ఉత్తరాది వారు మాత్రమే కాదు.. దక్షిణాది వారు కూడా రాణిస్తారనీ అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.

మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరేసి.. కేసీఆర్ ను ఘనంగా జాతీయ రాజకీయాల్లోకి పంపుదామని అన్నారాయన. దేశ వ్యాప్తంగా కేసీఆర్ తిరగడానికి వీల్లేని విధంగా.. కేంద్రం అడ్డుకుంటోందనీ, దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతుంటే.. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మాత్రం మోదీ ఏజెంట్‌గా మారారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పదవిని ఇరవై రెండు వేల కోట్లకు అమ్మిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని ఆరోపించారు. ఇందుకోసమే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు మంత్రి జగదీశ్ రెడ్డి. ద్రోహం, స్వార్ధం తప్ప.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాకొక అర్ధం లేదని, బీజేపీకి ఓటు వేస్తే.. మోటార్లకు మీటర్లు రావడం ఖాయమన్నారు. ఇలాంటి పరిస్థితులు అడ్డుకోవాలంటే.. మునుగోడులో గులాబీ జెండా ఎగరాల్సిందేనని.. ఈ విజయం దేశ వ్యాప్తం కావాలనీ అభివర్ణించారు మంత్రి జగదీశ్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..