Munugode Bypoll: మునుగోడులో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం.. ఆదివారం చండూర్ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్..

|

Oct 29, 2022 | 10:00 PM

బంగారిగడ్డ వద్ద ఆ పార్టీ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగసభ ప్రారంభం కానున్నది. ఈ సభలో..

Munugode Bypoll: మునుగోడులో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం.. ఆదివారం చండూర్ సభకు  ముఖ్యమంత్రి కేసీఆర్..
Telangana CM KCR
Follow us on

ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలివుండటంతో పార్టీలు మరింత దూకుడు పెంచాయి. నవంబర్ 1న సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. అయితే ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదివారం చండూరు మండలానికి రానున్నారు. బంగారిగడ్డ వద్ద ఆ పార్టీ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగసభ ప్రారంభం కానున్నది. ఈ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌ నేరుగా చండూరుకు చేరుకోనున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం తరువాత ప్రజల మధ్యకు వస్తున్న సీఎం కేసీఆర్.. రేపటి సభలో ఎలాంటి తూటాలు పేల్చుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ పెద్దలు, కొందరు కేంద్ర మంత్రులే లక్ష్యంగా రేపటి సభలో విరుచుకుపడతారని తెలుస్తోంది.

ఫామ్‌హౌస్‌ ఘటనలో అందరికీ తెలియని కొన్ని నిజాలను, కోణాలను సీఎం కేసీఆర్ బయటపెడతారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ లక్ష్యంగా జాతీయ పార్టీ పెట్టిన సీఎం కేసీఆర్.. ఫామ్‌హౌస్‌ డీల్‌ను నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లి జాతీయ స్థాయిలో బీజేపీని ఇరుకునపెట్టాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఫామ్‌హౌస్‌ డీల్‌పై మూడు రోజులుగా మౌనంగా ఉంటున్నారు సీఎం కేసీఆర్. కాకపోతే, ఈ ఘటనపై వరుస సమీక్షలు చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతోనూ ఈ డీల్‌పై చర్చించారు.

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సభ రద్దుకావడంతో.. బీజేపీ నేతలు ప్రచారంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఓటర్లను నేరుగా కలవడం ద్వారా ప్రచారం ఉధృతం చేయాలని భావిస్తున్నారు.  మొయినాబాద్ ఫామ్‎హౌస్ వ్యవహారం బీజేపీకి సంబంధం లేదని జనంలోకి తీసుకెళ్లగలిగామని కమలనాథులు అంచనా వేస్తున్నారు.

అటు చండూర్‎లో నవంబర్ 1న మహిళా గర్జన సభకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తమ అభ్యర్థి మహిళ కావడం వల్ల ఓట్లు రాబట్టేందుకు ఈ సభ మేలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం