Munugode Bypoll: మునుగోడులో మళ్లీ పోస్టర్ల కలకలం.. ‘అలా చెప్పే దమ్ముందా రాజగోపాల్‌?’ అని సవాల్‌ చేస్తూ..

'తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల కంటే ఏ ఒక్క రాష్ట్రమైనా ఎక్కువ ఇస్తుందా చెప్పే దమ్ముందా రాజగోపాల్' అని సవాలు చేస్తూ తెలంగాణలో ఆసరా, ఒంటరి మహిళ పెన్షన్ రూ.2016లు, అలాగే దివ్యాంగుల పెన్షన్ 3016లు అందిస్తోందని ఈ పోస్టర్లలో రాశారు.

Munugode Bypoll: మునుగోడులో మళ్లీ పోస్టర్ల కలకలం.. అలా చెప్పే దమ్ముందా రాజగోపాల్‌? అని సవాల్‌ చేస్తూ..
Posters In Chandur

Updated on: Oct 20, 2022 | 8:25 AM

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని చండూరు ప‌ట్టణంలో మళ్లీ  పోస్టర్లు వెలిశాయి. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా పట్టణమంతా పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల కంటే ఏ ఒక్క రాష్ట్రమైనా ఎక్కువ ఇస్తుందా చెప్పే దమ్ముందా రాజగోపాల్’ అని సవాలు చేస్తూ తెలంగాణలో ఆసరా, ఒంటరి మహిళ పెన్షన్ రూ.2016లు, అలాగే దివ్యాంగుల పెన్షన్ 3016లు అందిస్తోందని ఈ పోస్టర్లలో రాశారు. ఇదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, యూపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో అమలవుతోన్న పెన్షన్లను పోల్చారు. కాగా మునుగోడు నియోజకవర్గంలో ఇలా పోస్టర్లు వెలియడం ఇదేమి మొదటిసారి కాదు. 5 రోజుల క్రితం చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో ‘మునుగోడు ప్రజలారా.. మేం మోసపోయాం, మీరు మోసపోకండి’ అంటూ దుబ్బాక, హుజూరాబాద్‌ ప్రజల పేరుతో పోస్టర్లు అంటించారు. పట్టణం మొత్తం ఇలాంటి పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.

అంతకు ముందు ఇదే చండూరు పట్టణంలో నేడే విడుదల అనే పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ‘షా ప్రొడక్షన్స్‌ సమర్పించు.. 18 వేల కోట్లు సినిమా సత్యనారాయణ 70 ఎంఎం థియేటర్‌లో నేడే విడుదలవుతున్నదని.. అందరూ చూడాలని ఆ పోస్టర్‌పై రాశారు. అదేవిధంగా రాజగోపాల్‌కు 18వేల కోట్ల కాంట్రాక్ట్ కేటాయించారంటూ ఫోన్‌ పే తరహాలో కాంట్రాక్ట్‌ పే అంటూ పోస్టర్లు కూడా అంటించారు. ఇక రెండు రోజుల క్రితం రాజగోపాల్‌ అనుకూల పోస్టర్లు కూడా ప్రత్యక్షమయ్యాయి. చౌటుప్పల్, సంస్థాన్‌ నారాయణపురం పరిసర ప్రాంతాలు రాజగోపాల్‌‌ అనుకూల పోస్టర్లతో నిండిపోయాయి. ఫలిస్తున్న రాజన్న రాజీనామా పేరుతో పోస్టర్లను అంటించారు. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో మునుగోడు ప్రజల కలలు నెరవేరుతున్నాయని.. ప్రతి గ్రామానికి 20 లక్షల నిధులు వచ్చాయని పోస్టర్లు వేశారు. చౌటుప్పల్‌లో ఐదు డయాలసిస్‌ యూనిట్లతో పాటు హుటాహుటిన చేనేత బీమా ప్రకటించారంటూ పోస్టర్లలో వెల్లడించారు. మొత్తానికి మునుగోడులో పోస్టర్ పాలిటిక్స్‌ హీట్‌ పుట్టిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ  వార్తల కోసం క్లిక్ చేయండి..