Munugode Bypoll: ఓటర్లకు తాయిలాలు, ప్రలోభాలపై ఈసీ సీరియస్‌ ! ఇకపై వాటిని ఇచ్చినా, తీసుకున్నా కేసులు తప్పవు!

మునుగోడు ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున తాయిలాలు అందిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.

Munugode Bypoll: ఓటర్లకు తాయిలాలు, ప్రలోభాలపై ఈసీ సీరియస్‌ ! ఇకపై వాటిని ఇచ్చినా, తీసుకున్నా కేసులు తప్పవు!
Munugode Bypoll

Updated on: Oct 24, 2022 | 1:21 PM

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్ తేది దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఊరువాడా తిరిగేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ ఉప ఎన్నికలో డబ్బులు, మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తున్నాయి. అధికారులు, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్రమ నగదు ప్రవాహం ఆగడం లేదు. పోలీసుల తనిఖీల్లో రోజూ కోట్లాది రూపాయల నగదు పట్టుబడుతోంది. ఇదిలా ఉంటే మునుగోడు ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున తాయిలాలు అందిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. విచ్చలవిడిగా డబ్బులు, మద్యం, ఇతర తాయిలాలను పంపిణీ చేస్తున్నవారిపై, తీసుకున్నవారిపై ఐపీసీ సెక్షన్‌ 171(బీ) కింద కేసులు నమోదు చేయాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థిని/ఓటరును/ మరే ఇతర వ్యక్తిని బెదిరించినా, గాయపర్చినా సెక్షన్‌ 171(సీ) కింద కేసు పెట్టాలని సూచించింది. ఈ రెండు కేసుల్లో ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ నిబంధనలను అభ్యర్థులు, ఓటర్లకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం కల్పించాలని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలను ఆదేశించింది. ఈ మేరకు ఉప ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ కీలక విషయాలను వెల్లడించారు.

అదనపు బలగాలు..

మునుగోడు ఉప ఎన్నికలో అక్రమాలను అడ్డుకునేక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని అదనపు బలగాను మునుగోడుకు పంపింది. ఎన్నికల అదనపు పరిశీలకులుగా ఐఆర్‌ఎస్‌ అధికారి సుభోత్‌ సింగ్, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్‌ అధికారి సమత ముళ్లపూడిని నియమించింది. అక్రమ నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు మరో ఏడుగురు ఆదాయ పన్నుశాఖ అధికారులను ఆ శాఖ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ మునుగోడుకు పంపించనున్నారు. కాగా నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.2.49 కోట్ల నగదు, 1,483.67 లీటర్ల మద్యాన్ని పట్టుబడినట్లు వికాస్‌రాజ్‌ తెలిపారు. అలాగే పలు ఘటనల్లో 36 మందిని అరెస్టు చేసి 77 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..