MP Bandi Sanjay: బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టండి.. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి ఘటనపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ.. ఖమ్మం ప్రభుత్వాస్పత్రి ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పేలుడు ఘటనలో మృతి చెందిన, గాయపడినవారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు చేసి కఠినంగా శిక్షించాలన్నారు బండి సంజయ్.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సమావేశానికి బీఆర్‌ఎస్ నేతల రాక సందర్భంగా కార్యకర్తలు బాణసంచా పేల్చుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బాణసంచా నిప్పురవ్వలు సమీపంలోని గుడిసెపై పడి మంటలు అంటుకున్నాయి. ఇది చిన్న చిన్నగా మొదలై పెద్ద ఎత్తున సమీపంలోని మరిన్ని గుడిసెలకు వ్యాపించాయి.
సిలిండర్ పేలుడు ధాటికి పోలీసు కానిస్టేబుల్ సహా ఏడుగురు గాయపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలతో ఆరుగురు ఖమ్మంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిలో కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నారు. ప్రమాద సమయంలో అసలేం జరిగిందో.. ప్రత్యక్ష సాక్షి మాటల్లో విందాం.
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో గులాబీ నేతల నిర్లక్ష్యం కారణంగా బాణాసంచా నిప్పు రవ్వలు ఓ గుడిసెపై పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికరం. క్షతగాత్రులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలి. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సాయం అందించాలి. ఈ…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 12, 2023
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి ఓ గుడిసెపై పడ్డాయి. దాంతో.. ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గుడిసెకు మంటలు అంటుకోవడంతో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం