Hyderabad: ఇలాంటి కొడుకులు ఏ తల్లికి ఉండకూడదు.. కుమారులు చేసింది తట్టుకోలేక..

మనం ఎదిగే తీరు.. మన ప్రవర్తన ఎప్పుడూ మనల్ని కన్న తల్లిదండ్రులు తలెత్తుకునేలా ఉండాలి. కానీ ఇక్కడో ఇద్దరు కొడుకు మాత్రం.. వీళ్లను ఎందుకు కన్నానో అని ఆ తల్లే అనుకునేలా ప్రవర్తించారు. ఓ కొడుకు తండ్రినే పొట్టనపెట్టుకొని జైలుకు వెళ్తే.. మరో కొడుకు గంజాయికి బానిసై ఆమెపాలిట యముడిగా మారాడు. ఇది చూసి తట్టుకోలేకపోయిన తల్లి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Hyderabad: ఇలాంటి కొడుకులు ఏ తల్లికి ఉండకూడదు.. కుమారులు చేసింది తట్టుకోలేక..
Mother Suicide Hyderabad

Edited By:

Updated on: Aug 14, 2026 | 12:25 PM

కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఎన్నో ఆశలతో పెంచి పెద్ద చేసిన కొడుకులే ఆ తల్లికి తీరని శోకాన్ని మిగిల్చారు. చేతికి అందివచ్చి ఆసరాగా నిలవాల్సిన బిడ్డలు పెడదోవ పట్టడమే కాకుండా, దారుణాలకు ఒడిగట్టడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామానికి చెందిన తిరుపతి రవీందర్ భార్య సుధ (45) జీవితం కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. కొడుకుల ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె, హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ సర్దార్ పటేల్ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో హౌస్ కీపింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. అక్కడే ఓ చిన్న గదిలో ఉంటున్న ఆమెను కొడుకుల రాక్షసత్వం ప్రతినిత్యం వెంటాడింది.

ఆమె పెద్ద కొడుకు కొన్నేళ్ల కిందట సొంత తండ్రినే దారుణంగా హతమార్చాడు. కరడుగట్టిన నేరస్థుడిగా మారి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఊసలు లెక్కిస్తున్నాడు. భర్తను కోల్పోయి, పెద్ద కొడుకు జైలుపాలు కావడంతో మిగిలిన చిన్న కొడుకైనా తనకు అండగా ఉంటాడని ఆ తల్లి ఆశపడింది. కానీ ఆ చిన్న కొడుకు సైతం గంజాయి మహమ్మారికి బానిసై.. తల్లి జీవితాన్ని నరకప్రాయంగా మార్చాడు. నిత్యం మత్తులో ఊగుతూ, జులాయిగా తిరుగుతూ డబ్బుల కోసం కన్నతల్లిని వేధించడం, హింసించడం పరిపాటిగా మార్చుకున్నాడు.

ఒక కొడుకు తండ్రిని చంపి జైలుపాలైతే, మరో కొడుకు మత్తుపదార్థాలకు బానిసై రోజూ తనను నరకయాతనకు గురిచేస్తుండటంతో ఆ తల్లి కుంగిపోయింది. శ్రమించి సంపాదించే జీవనంలో నెమ్మదిగా సంతోషం కరువై, కొడుకుల అమానుష ప్రవర్తనతో దిక్కుతోచని స్థితికి చేరుకుంది. ఆరని గుండెకోత, నిరంతరం ఎదుర్కొంటున్న మానసిక వేదనను భరించలేక చివరికి ఆమె తనువు చాలించడమే శరణ్యమని భావించింది. తాను నివసిస్తున్న గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు వేగవంతం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us