
నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటకు చెందిన సాయిలు, వెంకటమ్మ దంపతులకు ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కట్నం కానుకలు ఇచ్చి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశాడు. సాయిలు కొడుకు యాదయ్య, సుమలత దంపతులు తమకున్న 8 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. యాదయ్య, సుమలత దంపతులకు కూతురు లావణ్య జన్మించింది. లావణ్య ఏడాది వయసున్నప్పుడు తండ్రి యాదయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మృతితో కూతురు లావణ్యతో కలిసి సుమలత ఒంటరిగా ఉంటోంది. తండ్రి నుండి లావణ్యకు వచ్చిన 8 ఎకరాల భూమికి గార్డియన్‌గా తాత సాయిలు ఉన్నారు. ఇదే సమయంలో అనారోగ్యం పాలైన సాయిలు, వెంకటమ్మ వైద్యం కోసం 30 లక్షలు వెచ్చించామని, 8 ఎకరాల భూమి ఇవ్వాలంటూ ముగ్గురు కూతుళ్లు కోర్టులో కేసు వేశారు.
కోర్టు తీర్పు ప్రకారం సుమలత.. ఆడపడుచులకు ఐదు లక్షల రూపాయలు చెల్లించి వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకుంది. అప్పటినుండి 8 ఎకరాల భూమి తమ చేతి నుండి జారిపోయిందని బంధువులు.. తల్లి కూతుళ్లు సుమలత, లావణ్యలపై కక్ష పెంచుకున్నారు. తల్లి కూతుర్లను అంతమొందిస్తే భూమి తమ పరమవుతుందని పథకం వేశారు. యధావిధిగా తమ పామాయిల్ తోటలో పని చేసేందుకు ఉదయం తల్లి కూతుళ్లు సుమలత, లావణ్యలు వచ్చారు. పథకం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి తల్లి కూతుర్లను చున్నీలతో గొంతు నిలిమి అత్యంత దారుణంగా హత మార్చారు. ఈ దారుణ ఘటనతో ఇబ్రహీంపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సాగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ డబుల్ మర్డర్ కు భూ తగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపారు.