
నల్గొండ, మే 18: ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు యాదయ్య ఉన్నారు. వీరిలో యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలత (40)తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె లావణ్య (20) జన్మించింది. లావణ్య పుట్టిన ఆరు నెలలకే యాదయ్య మృతి చెందాడు. భర్త మృతి చెందడంతో సుమలత వ్యవసాయ పనులు చేస్తూ లావణ్యను పెంచసాగింది. అయితే యాదయ్యకు వారసత్వంగా 6 ఎకరాల వ్యవసాయ భూమి వచ్చింది.
ఈ భూమిని లావణ్య పేరు మీద రిజిస్టర్ చేసి నాయనమ్మ వెంకటమ్మ.. గార్డియన్‌గా ఉండసాగింది. ఇటీవల లావణ్య మేజర్ కావడంతో ఆ భూమి ఆమెకు చెంతుంది. అయితే లావణ్య పేరు మీద రిజిస్టర్ అయన భూమిపై కన్నేసిన నానమ్మ వెంకటమ్మ లావణ్య, సుమలతను అడ్డుతొలగిస్తే.. ఆ ఆస్తి మొత్తం తమకే చెందుతుందని పథకం వేశారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా ముగ్గురు ఆడపడుచులకు, సుమలతకు మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ గొడవలు కోర్టు వరకు వెళ్లాయి.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సుమలత, ఆమె కుమార్తె లావణ్య ఊరి బయట ఉన్న పొలంలోకి పనికి వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని కొంతరు వారిపై దాడి చేసి కళ్లలో కారం చల్లి, మెడకు చున్నీ బిగించి చంపారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆస్తి, కుటుంబ తగాదాలే ఈ హత్యలకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతురాలి తమ్ముడు మానుపాటి వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపారు. సుమలత ఆడబిడ్డలు, అత్త వెంకటమ్మ ఈ హత్యలకు కారణమని ఆరోపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.