హైదరాబాద్‌లో కుక్కలు దొరికినవాళ్లను దొరికినట్టు కరిచేస్తుంటే, భద్రాద్రి కొత్తగూడెంలో కొండముచ్చులు స్వైరవిహారం చేస్తున్నాయి. అవి ఎదురొచ్చినా, మనం వాటికి ఎదురెళ్లినా అంతే సంగతులన్నట్టుగా రెచ్చిపోతున్నాయి. అక్కడా ఇక్కడని లేదు… ఎక్కడ చూసినా కోతుల వీరంగమే. వెంటబడిమరీ కరిచేస్తున్నాయి కొండముచ్చులు. ధైర్యంచేసి ఎదురెళ్లితే హాస్పిటల్ బెడ్‌పై పడాల్సిందే. ఆ రేంజ్‌లో చెలరేగిపోతున్నాయి కోతులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడా ఇక్కడని లేదు, ఎక్కడ చూసినా కోతులే కోతులు. ఆఫీసూ, ఇళ్లు, పొలం, గుడిబడీ ఎక్కడ చూసినా కోతుల గుంపులే. ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ తమదే అడ్డా అన్నట్టుగా రెచ్చిపోతున్నాయి కొండముచ్చులు. వానర గుంపు చేసే రచ్చతో నాలుగైదు మండలాలు విలవిల్లాడిపోతున్నాయి. కోతుల బెడద నుంచి తమను కాపాడేవాడే లేడా అని మొత్తుకోని వాడే లేదంటే అతిశయోక్తికాదు. ఇలా నెలకాదు, రెండు నెలలు కాదు, పోనీ ఏడాది కాదు, 20ఏళ్లుగా కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వానర సైన్యం చేస్తోన్న కిష్కిందకాండతో విలవిల్లాడిపోతున్నాయి అనేక గ్రామాలు. హాస్పిటల్, స్కూల్, షాప్‌కి వెళ్లాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి. కోతుల దెబ్బకు వందల మంది టీకాలు వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏ రేంజ్‌లో రెచ్చిపోతున్నాయో అర్ధంచేసుకోవచ్చు.
కొండముచ్చుల దాడులతో గాయాలపాలవడమే కాదు ఆస్తుల ధ్వంసంతోనూ నష్టపోతున్నారు ప్రజలు. కోతుల భయంతో వ్యవసాయం కూడా మానేశారంటే వానర గుంపు రచ్చ ఎలాగుందో అర్ధంచేసుకోవచ్చు. బైక్స్ సీట్స్ కవర్లు చింపేయడం, విలువైన పత్రాలు ఎత్తుకుపోవడం, స్కూలూ-ఇళ్లల్లోకి చొరబడి ఆహారం లాక్కెళ్లిపోతుండటంతో జనం హడలిపోతున్నారు.
కోతుల స్వైరవిహారంతో దినదినగండం నూరేళ్ల ఆయుస్సులా మారింది రైతులు, ప్రజల పరిస్థితి. కోతుల బెడద నుంచి పంటలను కాపాడుకోవడానికి వింత వింత వేషాలు వేస్తున్నారు రైతులు. ఇల్లందు మండలం కోటిలింగాలలో ఓ రైతు పడరాని పాట్లు పడుతున్నాడు. చింపాంజీ వేషం వేసుకని వింతవింత శబ్దాలుచేస్తూ కోతులను వెళ్లగొడుతున్నాడు.
పాలడుగు గ్రామంలో అయితే ఓ యువకుడు కోతులను వెళ్లగొట్టడానికి ఏకంగా ఎలుగుబంటి వేషాన్నే తన వృత్తిగా మార్చుకున్నాడు. మరికొందరు రైతులైతే పులి బొమ్మలతో కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పొలాల్లో మైక్స్ ఏర్పాటు చేసుకొని పులి, నక్క, కుక్క అరుపులను ప్లే చేస్తూ పంటలను కాపాడుకుంటున్నారు రైతులు. బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం, కొనిజర్ల, తల్లాడ మండలాల్లో ఈ పద్ధతులను పాటిస్తున్నారు ప్రజలు.
మొండికుంట గ్రామస్తులైతే కోతుల బెడదకు ఒకే ఒక్క చిన్న ఐడియాలో చెక్ పెట్టారు. సోలార్ విద్యుత్ ఫెన్సింగ్‌తో కోతుల గుంపులకు అడ్డుకట్ట వేశారు గ్రామస్తులు. మొండికుంట గ్రామస్తుల ఐడియా చుట్టుపక్కల గ్రామాలను సైతం ఆకట్టుకుంటోంది. వాటెన్ ఐడియా సర్‌జీ అంటోన్న బాధిత గ్రామాలు.. కోతుల బెడద నుంచి బయటపడేందుకు సోలార్ ఫెన్సింగ్‌ను ఆశ్రయిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..