ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్‌లో మరోసారి కవిత పేరును యాడ్ చేశారు ఈడీ అధికారులు. కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించారని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం ఈ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అంకౌంటెంట్ (సీఏ) గోరంట్ల బుచ్చిబాబుకు ఢిల్లీ సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 8న సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. బుచ్చిబాబును 14 రోజుల కస్టడీ విధించింది.
ఇప్పటికే పలువురుని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో దర్యాప్తు చేసిన అనంతరం ఆయనను అరెస్టు చేశారు. వారం రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు.
కాగా.. గతేడాది డిసెంబర్ లో ఢిల్లీ సీబీఐ విభాగానికి చెందిన ఎస్పీ స్థాయి మహిళ అధికారి సహా అయిదుగురు అధికారుల బృందం కవితను సుదీర్ఘంగా విచారించారు. ఢిల్లీ మద్యం కేసులో.. 160 సీఆర్‌పీసీ చట్టం ప్రకారం సాక్షిగా విచారించనున్నామని… సీబీఐ ముందుగానే కవితకు సమాచారం పంపింది. ఈ మేరకు కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు.. మద్యం కేసులో ప్రశ్నలు సంధించారు. కవిత వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..