ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్‌ఎల్‌సీ కవితపై ఈడీ జరుపుతున్న రెండో రోజు విచారణ ముగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయంలో సోమవారం విచారణకు హాజరైన కవితను దాదాపు పదిన్నర గంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు. ఇక ఈ విచారణ ఇన్ని గంటల పాటు జరగడంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠతను రేపింది. అంతకముందు ఢిల్లీ ఈడీ ఆఫీసు వద్ద ఢిల్లీ పోలీసు ఎస్కార్టు వాహనం, వైద్య బృందం కనిపించడంతో దేశం దృష్టి కవితవైపు మళ్లింది. అయితే ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యలయంలో ఉదయం 11 గంటల నుంచి కవితను ఈడీ ఆధికారులు విచారిస్తున్న క్రమంలోనే.. ఆ ఆఫీసు వద్ద పోలీస్ ఎస్కార్ట్ వాహనం కనిపించింది. అంతేకాక ఈడీ కార్యాలయానికి డాక్టర్ల బృందం వచ్చి వెళ్లడం.. వారిలో మహిళా డాక్టర్లు కూడా ఉండడంతో ఎక్కడా చూసినా ఎంఎల్‌సీ కవిత గురించే చర్చ సాగింది. మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న సిసోడియాతో పాటు మిగిలినవారికి వైద్య పరిక్షలు నిర్వహించారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో కవితపై విచారణ జరుగుతుండగానే ఈడీ కార్యాలయానికి తెలంగాణ ఆడిషనల్ ఏజీ.. ఆయనతో పాటు న్యాయవాదులు భరత్, గండ్రమోహన్ వెళ్లడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందనేలా అందరి దృష్టి అటువైపే పడింది. అయితే సుదీర్ఘ సమయం సాగిన ఈడీ విచారణ ముగియడంతో కవిత చిరునవ్వుతో ఆఫీసు బయటకు వచ్చారు.
కాగా, మద్యం కేసులో మనీలాండరింగ్ కేసులో కవితపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను అధికారులు ప్రశ్నించారు. అయితే గత వారం కవితకు ఈడీ నోటీసులు జారీ చేసినా.. ఆమె విచారణకు హాజరుకాలేదు. తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించనుందని, న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వేచిచూడాలని కవిత ఈ నెల 16న లేఖ ద్వారా ఈడీకి విజ్ఞప్తి చేశారు. కానీ ఈ రోజు విచారణకు రావాలని కవితకు ఈడీ మళ్లీ నోటీసులు పంపడంతో ఆమె విచారణకు హాజరయ్యారు. అలాగే రేపు మరోసారి ఈడీ ఆఫీసుకు రావాలని కవితకు రావాలని ఈడీ అధికారులు నోటీసులిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..