Khammam: బ్రిడ్జిపై నుంచి పడ్డ కారు.. దానిపై టన్నుల కొద్దీ చువ్వలు.. ఇక్కడే ఓ అద్భుతం

ఖమ్మం జిల్లా వైరా వద్ద హై లెవెల్ బ్రిడ్జిపై లారీ, కారు ఢీకొని 50 అడుగుల లోతు నదిలో పడిపోయాయి. టన్నుల కొద్దీ ఇనుప చువ్వలు కారుపై పడ్డా, కారులోని ఐదుగురు స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. వారి ప్రాణాలను వైరా నదిలో ఉన్న చెత్త కుప్ప రక్షించింది. ఈ ప్రమాదం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Khammam: బ్రిడ్జిపై నుంచి పడ్డ కారు.. దానిపై టన్నుల కొద్దీ చువ్వలు.. ఇక్కడే ఓ అద్భుతం
Vaira Bridge Accident

Edited By:

Updated on: May 31, 2025 | 11:48 AM

ఆవగింజంత ఆయుష్షు ఉన్నా వందేళ్లు బతికేయొచ్చనడానికి నిదర్శనం ఈ ఘటన. ఖమ్మం జిల్లా వైరా వద్ద హైవేపై ఉన్న హై లెవెల్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన డీసీఎం కారును.. ఇనుప చువ్వలు లోడ్‌తో వెళ్తున్న లారీ డీ కొట్టింది. దీంతో బ్రిడ్జిపై నుంచి 50 అడుగుల లోతులో ఉన్న నదిలోకి లారీ, కారు పడిపోయాయి. కారుపైన పెద్ద సంఖ్యలో ఇనుప చువ్వలు గుట్టగా పడిపోయాయి.. కారులోని వారంతా బ్రతికి బట్టకట్టే ఛాన్స్‌ లేదని అందరూ అనుకున్నారు. కానీ స్వల్పగాయాలతో అంతా బయటపడ్డారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతా ప్రాణాలతో బయటపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఖమ్మం జిల్లా వైరాకు సమీపంలోని హైలెవల్ వంతెన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యుంజయులుగా బయటపడ్డారు. బ్రిడ్జి మీద నుంచి 50 అడుగుల లోతులో ఉన్న నదిలో కారు పడింది. ఆ తర్వాత దానిపై లారీలోని టన్నుల కొద్దీ ఇనుప చువ్వలు పడ్డాయి.. దీంతో కారు నుజ్జునుజ్జయిపోయింది. కారులో ఒకే కుటుంబానికి ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. వారెవరికీ ఎలాంటి ప్రాణహానీ కలగలేదు. అందరూ గాయాలతో బయట పడ్డారు. వైరా నదిలో మునిసిపాలిటీ వారు పోసిన చెత్త ఈ ఐదుగురి ప్రాణాలను కాపాడింది. లారీలోని ఇనుప చువ్వలు కారుమీద పడిన సమయంలో కారు చెత్త కుప్పలో కూరుకుపోవడంతో దానిలో ఉన్న ఐదుగురు గాయాలతో బయటకొచ్చారు. ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి..ఈ ప్రమాదం చూసిన వారు ఒక్కసారిగా భయ బ్రాంతులకు గురయ్యారు. అప్పటికే చిమ్మ చీకట్లు కమ్ముకోవడంతో అసలు ఏమి జరిగిందో తెలియక ఆందోళన చెందారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే కారులోనివారు కచ్చితంగా మృతి చెంది ఉంటారనుకుంటారు. కానీ వారు మృత్యుంజయులుగా బయట పడటం వారి అదృష్టమేనని అందరూ అనుకున్నారు.

కారులో ఉన్న మొగిలిశెట్టి కోటేశ్వరరావుకు ఓ మాదిరి గాయాలు కాగా ఆయన కుమారుడు మొగిలిశెట్టి రాజశేఖర్, కోడలు గీత, మనవడు,మనుమరాలు తేజస్, జ్యోతి స్వల్పగాయాలతో బయటపడ్డారు. కోటేశ్వరరావును ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రధాన హైవే కావడంతో కొన్ని కిలోమీటర్లు మేర.. వాహనాలు నిలిచి పోయి. .ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు..ఈ ప్రమాద ఘటన చూసి ఇది నిజమా..ఏదైనా సినిమాలో సన్నివేశమా..అని చర్చించికుంటున్నారు. బ్రిడ్జి పై నుంచి నదిలో పడి.. ప్రాణాలతో బయటకు రావడం చూస్తే నిజంగా అదృష్టవంతులు..మృత్యుంజయులే..అంటున్నారు.

వీడియో దిగువన చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.