Hyderabad: జంట నగర ప్రజలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు

|

Jul 28, 2022 | 4:15 PM

గతంలో మొక్కలు నాటడం మొక్కుబడి కార్యక్రమంలా ఉండేది. కానీ, సీఎం కేసీఅర్ దీన్ని ఒక యజ్ఞంలా మార్చి, ప్రజలందరినీ భాగస్వామ్యులను చేశారు.

Hyderabad: జంట నగర ప్రజలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు
Urban Forest Park
Follow us on

Hyderabad: విశ్వనగరం హైదరాబాద్‌కు పచ్చలహారంగా నిలుస్తున్నాయి పార్కులు.. భాగ్యనగర పచ్చదనానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. హరితహారం పేరుతో తెలంగాణకు మణిహరం లాంటి అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకులను తీర్చిదిద్దింది. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొత్తగా మరో ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. నగరవాసులకు మానసిక ఉల్లాసంతోపాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూలై 28 గురువారం ఉదయం 9 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆ తరువాత వరుసగా 10.35 గంటలకు పల్లెగడ్డ, 11 గంటలకు సిరిగిరిపూర్, 11.30 గంటలకు శ్రీనగర్, మధ్యాహ్నం 12 గంటలకు తుమ్మలూర్, 12.40 గంటలకు మన్యం కంచ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లను ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. సందర్శకులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…

అడవులను రక్షించాలి, పచ్చదనం పెంచాలి అనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హారితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 258 కోట్ల మొక్కలు నాటాము. ఎనిమిదవ విడతలో 19.54 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.అటవీ రక్షణ, పునర్జీవ చర్యలతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంది. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కలిగించేలా హైదరాబాద్‌తో పాటు పట్టణాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. మహేశ్వరం నియోజకవర్గంలో ఇవాళ ఒక రోజే ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ప్రారంభించుకుని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. సుమారు రూ. 22 కోట్లతో HMDA ఈ పార్కులను అభివృద్ధి చేసిందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వివరించారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ఎంపీ సంతోష్ కుమార్ దేశ వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను, పారిశ్రామిక వేత్తలను కూడా ఇందులో భాగస్వామ్యులను చేశారంటూ ప్రశంసించారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి:

కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్ చుట్టుపక్కల అర్బన్ లంగ్ స్పేస్ క్రియేట్ చేసేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విజన్ తో పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చు అనడానికి హరిత హారం కార్యక్రమం నిదర్శనమన్నారు. గతంలో మొక్కలు నాటడం మొక్కుబడి కార్యక్రమంలా ఉండేది. కానీ, సీఎం కేసీఅర్ దీన్ని ఒక యజ్ఞంలా మార్చి, ప్రజలందరినీ భాగస్వామ్యులను చేశారు. పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తున్న అటవీ శాఖ HMDA కు అభినందనలు.. అటవీ భూములను, అర్బన్ ఫారెస్ట్ పార్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులపైనే ఉందన్నారు. వారంలో ఒక రోజు స్థానికులకు ఉచితంగా ఎంట్రీ కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, అర్బన్ ఫారెస్ట్ పార్క్ ల వివరాలు పరిశీలించినట్టయితే..
రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌ను ఏర్పాటు చేయాల‌ని సీయం కేసీఆర్ నిర్ణ‌యించారు. రూ. 700 కోట్ల అంచ‌నా వ్య‌యంతో అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 400 కోట్ల వెచ్చించి, మొత్తం 39 అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో తీసుకువచ్చారు. ఇవాళ మ‌రో 6 అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌ను కలుపుకుని మొత్తం 45 అర్బ‌న్ ఫారెస్ట్ పార్కులు ప్ర‌జ‌లకు అందుబాటులోకి వ‌చ్చాయి.

సందర్శకుల కోసం ఎంట్రీ ప్లాజా, విజిట‌ర్స్ పాత్వే, ఇంట‌ర్ప్రెటేష‌న్ షేడ్ స‌ఫారి ట్రాక్, గజేబో, వాచ్ ట‌వ‌ర్, గ్యాప్ ప్లాంటేష‌న్, అటవీ ప్రాంతం అంతా రక్షణ గోడ (చైన్ లింక్ ఫెన్సింగ్, సీ త్రూ వాల్), బోర్ వెల్, పైప్ లైన్, ఇత‌ర‌ సౌకర్యాల‌ను క‌ల్పించారు.

1. నాగారం అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్
ఔటర్‌ రింగ్ రోడ్ కు 7 కిలోమీట‌ర్ల దూరంలో మ‌హేశ్వ‌రం మండలం పెద్ద‌పులి నాగారంలో 556. 69 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.8.17 కోట్ల వ్య‌యంతో నాగారం అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ను H.M.D.A అభివృద్ధి చేసింది.

2. ప‌ల్లెగ‌డ్డ అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్
మ‌హేశ్వ‌రం మండలం హ‌ర్ష‌గూడ గ్రామంలో 87.41హెక్టార్ల విస్తీర్ణంలో రూ.2.98 కోట్ల వ్య‌యంతో ప‌ల్లెగ‌డ్డ అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ను H.M.D.A అభివృద్ధి చేసింది.

3. సిరిగిరిపురం అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్
మ‌హేశ్వ‌రం మండలం సిరిగిరిపురం గ్రామంలో 102.39 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.3.8 కోట్ల వ్య‌యంతో సిరిగిరిపురం అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ను H.M.D.A అభివృద్ధి చేసింది.

4. శ్రీన‌గ‌ర్ అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్
తుక్కుగూడ మున్సిపాలిటీ ప‌రిధిలో శ్రీన‌గ‌ర్ గ్రామంలో
526. 91హెక్టార్ల విస్తీర్ణంలో రూ.8.34 కోట్ల వ్య‌యంతో శ్రీన‌గ‌ర్ అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ను H.M.D.A అభివృద్ధి చేసింది.

5. తుమ్మలూర్ అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్
కందుకూర్ మండలం తూమ‌లూర్ గ్రామంలో 161.87 హెక్టార్ల విస్తీర్ణంలో తూమ‌లూర్ అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ను TSIIC అభివృద్ధి చేసింది.

6. మ‌న్యంకంచ‌ అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్
కందుకూర్ మండలం లేమూర్ గ్రామంలో 58.78 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.3.49 కోట్ల వ్య‌యంతో మ‌న్యంకంచ‌ అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ను H.M.D.A అభివృద్ధి చేసింది.

ఇక,ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణి దేవి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్. ఎం. డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, HMDA డైరెక్టర్ ప్రభాకర్, HMDA ఎస్.ఈ. హుస్సేన్, HMDA అసిస్టెంట్ డైరెక్టర్ రాములు, F.D.O. విజయానంద రావు, వైల్డ్ లైఫ్ బోర్డ్ మెంబర్ రాఘవ, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిదులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి