Munugode ByPoll: రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే.. మునుగోడు విజయంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని.. దానికి నిదర్శనమే మునుగోడు ఉప ఎన్నిక ఫలితమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారాకరామారావు పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం తర్వాత.. మంత్రి కేటీఆర్..

Munugode ByPoll: రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే.. మునుగోడు విజయంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Minister Ktr

Updated on: Nov 06, 2022 | 6:24 PM

రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని.. దానికి నిదర్శనమే మునుగోడు ఉప ఎన్నిక ఫలితమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారాకరామారావు పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం తర్వాత.. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చిన మూడు ఉప ఎన్నికల్లో వరుసగా టీఆర్ ఎస్ విజయం సాధించిందన్నారు. తమ పార్టీ విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీకి మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎం అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఓటమిని హుందాగా అంగీకరించాలన్నారు. తాము గతంలో హుజురాబాద్, దుబ్బాకలో ఓడిపోయినప్పుడు తాము ఓటమిని హుందాగా అంగీకరించామన్నారు. ఓటమి చెందినంత మాత్రన నిందలు వేయడం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ నాయకులు దిగజారి ప్రవర్తించారన్నారు. అసత్య ప్రచారంతో టీఆర్ ఎస్ ప్రభుత్వంపై బీజేపీ బురద జల్లిందని.. అయినా ప్రజలు తమ పార్టీని గెలిపించారన్నారు.

అహంకారం, డబ్బు మదంతో ఈ ఎన్నికను తెలంగాణ ప్రజల మీద బీజేపీ ఢిల్లీ పెద్దలు బలవంతంగా రుద్దారన్నారు. మునుగోడు ఫలితంతో తెలంగాణ ప్రజల ఆత్మబావుట ఎగురవేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజగోపాల్ రెడ్డిని వెనుక ఉండి ఆడించింది ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

తెలంగాణలో రాజకీయ కుట్రలకు బీజేపీ పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. టీఆర్ ఎస్ పార్టీకి మరింత ఎక్కవు మెజార్టీ రావల్సి ఉందని, బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడి, డబ్బు, మద్యంతో మెజార్టీని మాత్రమే తగ్గించగలిగారని, గెలుపును ఆపలేకపోయారన్నారు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని మునుగోడు ఫలితం ద్వారా నిరూపించారన్నారు. మొదటిసారి వందల కోట్ల రూపాయలను ఒక ఎన్నిక కోసం ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు మునుగోడుకు డబ్బు సంచులు పంపించారని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి తరువాత నుంచి బీజేపీ నాయకుల అనుచరుల వద్ద కోట్ల రూపాయల డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకోలేదా అని ప్రశ్నించారు. కేంద్ర బలగాలతో మునుగోడుపై దండయాత్ర చేసినా.. టీఆర్ ఎస్ విజయాన్ని ఆపలేకపోయారన్నారు. ఈ ఎన్నిక డబ్బు మయం అయిందని అంతా విమర్శిస్తున్నారని, తెలంగాణలో హుజురాబాద్, మునుగోడు ఎన్నికలోనే ఎన్నిక ధన మయం కాలేదా అని ప్రశ్నించారు. హుజురాబాద్, మునుగోడులో ధనవంతులు, కాంట్రాకర్లు ఎన్నికల్లో పోటీ చేయడం వల్లే ఎన్నికలు కాలుష్యం అయ్యాయని, డబ్బు మయం అయిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ ఢిల్లీ పెద్దలు ప్రయత్నించి.. అడ్డంగా దొరికిపోయారన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు ప్రభుత్వంపై అసత్య ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..